యువకుడి ఉసురు తీసిన టిక్‌టాక్‌ వీడియో

Video Viral in Tik tok And Commits Suicide in Kuwait - Sakshi

కువైట్‌లో శివకోడు యువకుడి ఆత్మహత్య

సాక్షి, రాజోలు(తూర్పుగోదావరి జిల్లా): పేదరికంతో బాధ పడుతున్న కుటుంబానికి అండగా నిలవాలని ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన శివకోడు గ్రామానికి చెందిన పుచ్చకాయల మోహనకుమార్‌ (30) ఈ నెల 3వ తేదీన అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు వేసుకున్న చీటీ పాట సొమ్ము చెల్లించలేదని అతడి ఫొటోలతో టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో మనస్తాపం చెందిన అతడు కువైట్‌లో నివాసం ఉంటున్న కాంప్లెక్స్‌లో ఉరి వేసుకున్నాడు. వారం తర్వాత ఆదివారం అతడి మృతదేహం శివకోడు చేరుకుంది. చేతికి అందివచ్చిన కొడుకు కువైట్‌ వెళ్లి విగతజీవిగా రావడంతో తల్లి విజయకుమారి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. శివకోడు చేరుకున్న మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

రెండేళ్ల క్రితం కువైట్‌ వెళ్లిన అతడు ఐరన్‌ షాపులో పనికి చేరాడు. అక్కడే ఒక రూమ్‌లో స్నేహితులతో కలసి ఉన్న అతడు రెండు వేల దినార్లు (రూ.4.60 లక్షలు) చీటీ పాటలో సభ్యునిగా చేరాడు. పాడుకున్న చీటీ సొమ్ము కట్టకుండా పారిపోయాడని, ఫొటోల్లో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ అతడి స్నేహితులు వడ్డి దుర్గారావు, మధు కలసి అతడి ఫొటోలతో చేసి వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టారు. అయితే అతడు చీటీ పాట పాడుకోకుండా నెల వారీ సొమ్ము చెల్లిస్తున్నాడని, కొంత సొమ్ము స్నేహితుల నుంచి అప్పుగా తీసుకుని చీటీ సొమ్ము చెల్లిస్తున్నా ఈ వీడియో పెట్టారని మృతుడి బావ కందికట్ల రాజబాబు తెలిపారు. తను కూడా కువైట్‌లోనే ఉంటున్నానని, భారత రాయబార కార్యాలయం ద్వారా కువైట్‌ రాయబార కార్యాలయంతో సంప్రదించి బావమరిది మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని వచ్చామన్నారు.

నెలరోజుల్లో ఇంటికి వస్తానన్నాడు..  
రెండేళ్లుగా కువైట్‌లో ఉంటున్న కొడుకు నెల రోజుల్లో వచ్చేస్తానని తల్లి విజయకుమారికి ఫోన్‌ చేశాడు. అయితే అతడు విగతజీవిగా వచ్చాడని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కువైట్‌ వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటే కనీసం ప్రాణాలతో ఉండేవాడని ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top