ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్లు!

Two smugglers caught in the same day - Sakshi

రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్, పౌడర్‌ రూపంలో పసిడి స్మగ్లింగ్‌

ఇద్దరిని పట్టుకున్న శంషాబాద్‌ కస్టమ్స్‌ ఏఐయూ టీమ్‌

4 కేజీల బంగారం స్వాధీనం,  సాగుతున్న విచారణ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ అధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ) అధికారులు బుధవారం ఒక్క రోజే ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు.

ప్రత్యేక శస్త్రచికిత్సలు..
ఈ స్మగ్లింగ్‌ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న వారి వద్ద పనిచేస్తూ లేదా కమీషన్‌ తీసుకుంటూ పసిడిని దేశంలోకి తీసుకువచ్చే వారిని క్యారియర్లు అంటారు. ఈ కీలక వ్యక్తులు సుదీర్ఘకాలం తమ వద్ద పనిచేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్‌ పేపర్‌ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. బుధవారం చిక్కిన ఇద్దరిలో ఒకరు ఈ రూపంలోనే పసిడిని తీసుకువచ్చారు.

హెన్నాలో బంగారం పొడి..
ఇతడు పట్టుబడిన కాసేపటికే మరో క్యారియర్‌ సైతం పట్టుబడ్డాడు. ఇతగాడు బంగారాన్ని పొడి చేసి.. హెన్నాతో (మెహెందీ పొడి) కలిపి.. పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇలా పసిడిని పొడి రూపంలో తీసుకువచ్చి చిక్కిన కేసులూ అనేక ఉంటున్నాయి. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువ. దీంతో మరో అడుగు ముందుకు వేసిన స్మగ్లర్లు బంగారం పొడిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేస్తున్నారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్‌ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్‌ తయారీకి వినియోగించే లిక్విడ్స్‌ వాడుతున్నారు. ఇతర కెమికల్స్‌ వాడితే విమానంలో తరలించడం కష్టమనే భావంతో ఈ లిక్విడ్స్‌ వినియోగించి ఆ మిక్స్‌ను పేస్ట్‌గా మారుస్తున్నారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్‌ కవర్‌లో ప్యాక్‌ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్‌ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేస్తున్నారు. ఇలా తీసుకువచ్చిన వ్యక్తినీ కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top