
ఘటనా స్థలం దృశ్యం , ఘటనా స్థలంలో మృతి చెందిన శామ్యూల్, దావీద్
దుత్తలూరు : జాతీయ రహదారిపై ఆగి ఉన్న కాంక్రీట్ మిక్సర్‌ను చీకట్లో గుర్తించలేక బైక్ ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి 565వ జాతీయ రహదారిపై దుత్తలూరు–నర్రవాడ మార్గమధ్యంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామానికి చెందిన కంచుపాటి దావీద్ (50) కుమారుడు వివాహ నిశ్చితార్థం నిమిత్తం ఉదయగిరి మండలం సున్నంవారిచింతలకు చెందిన బక్కా శామ్యూల్ (35), అప్పసముద్రానికి చెందిన దావీద్, గన్నేపల్లికి చెందిన నప్పెర్ల నారాయణ బైక్‌పై దుత్తలూరు నుంచి కొత్తపేటకు బయలుదేరారు.
దుత్తలూరు–నర్రవాడ మార్గమధ్యంలో జాతీయ రహదారిపై కాంక్రీట్ మిక్సర్ వాహనం ఆగి ఉంది. చీకట్లో బైక్‌పై వెళ్తున్న వీరు ఆ వాహనాన్ని గుర్తించలేక వెనుక ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న బక్కా శామ్యూల్ తల నుజ్జునుజ్జయింది. తలలోని మెదడు భాగం చెల్లాచెదురై అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యలో కూర్చొని ఉన్న కంచుపాటి దావీద్ తలకు బలమైన గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉండగా 108కు సమాచారమందించారు. 108 వాహనం ఘటనా స్థలానికి చేరుకునే సరికి అతను కూడా మృతి చెందాడు.
బైక్ వెనుక వైపు కూర్చొని ఉన్న నారాయణకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న ఉదయగిరి సీఐ సుబ్బారావు, దుత్తలూరు ఎస్సై ఎం.వెంకటరాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద విషయం తెలిసిన పరిసర ప్రాంత ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు, మృతదేహాలను చూసి చలించిపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.