క్రిస్మస్‌కు వచ్చి.. కానరాని లోకాలకు

Two Boys Died In Warangal - Sakshi

బచ్చన్నపేట: కిస్మస్‌ వేడుకలకు వచ్చిన ఇద్దరు విద్యార్థులకు అవే చివరి గడియలయ్యాయి. ఆడు తూ పాడుతూ పలకరించిన ఆ బాలురు లేరనే సరికి గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరుకు చెందిన బంగారు రాజు, హైదరాబాద్‌ మల్కాజిగిరికి చెందిన ఏసురాజులను హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలోని ఫీచర్‌ ఫౌండేషన్‌ అనాథాశ్రమంలో చదువుల నిమిత్తం చేర్పించారు. వీరిద్దరికి తండ్రులు లేరు. తల్లులు పలువురు ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.

మృతులు ఏసు రాజు (12) 7వ తరగతి, బంగారి రాజు(15) 9వ తరగతి చదువుతున్నారు. బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కంత్రి బాపురాజు, ప్రశాంత్‌ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి నిరుపేద విద్యార్థులు పడుతున్న కష్టాలను చూడలేక 2004 సంవత్సరంలో ఫీచర్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. అప్పటి నుంచి పలువురు నిరుపేద విద్యార్థులను చేర్పించుకొని వారికి విద్యా బుద్ధులను నేర్పించి ప్రయోజకులను చేస్తున్నారు. వారు ప్రతి సంవత్సరం సొంత గ్రామమైన కేసిరెడ్డిపల్లికి క్రిస్టమస్‌ పండుగకు వచ్చి నిరుపేదలకు దుప్పట్లను, పాఠశాల విద్యార్థులకు బుక్కులను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేస్తారు. అదే క్రమంలో కేసిరెడ్డిపల్లికి 30 మంది విద్యార్థులతో వచ్చిన బృంద సభ్యులు శుక్రవారం నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.

ఆ బృందంలోని ఇద్దరు బంగారి రాజు, ఏసురాజులు స్నానం చేయడానికి గ్రామ చివర ఉన్న మల్లంకుంట్లకు వెళ్లారు. ఇటీవల మిషన్‌ కాకతీయ పథకంలో చెరువు మరమ్మతు పనులను చేయడంతో చెరువును లోతుగా తవ్వారు. ఆ గుంతలోకి వెళ్లిన ఇద్దరు రాజులు ఒకరి కొకరు చేతులను అందించుకొని నీటిలో మునిగారు. వీరితో పాటు స్నానానికి వచ్చిన ఇమ్మానియేల్‌ అనే విద్యార్థి వారిని బయటకు లాగడానికి చేతిని అందించేందుకు ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. ఈ విషయాన్ని బృంద సభ్యులకు తెలుపగా వారంతా పరుగు పరుగున వచ్చే సరికే వారు మునిగి పోయారు. విషయాన్ని పోలీసులకు తెలుపగా ఘటనా స్థలానికి నర్మెట సీఐ మల్లేష్‌ యాదవ్, ఎస్సై రంజిత్‌రావు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top