
తిరువొత్తియూరు : కార్పొరేషన్ కార్యాలయ మహిళా అధికారిని బెదిరించి నగదు ఇవ్వమని కోరిన ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆవడి కార్పొరేషన్ పట్టణాభివృద్ధి కార్యాలయ అధికారిణి సుబ్బుతాయి. ఆమె శుక్రవారం తన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గదిలోకి చొరబడిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తాము ఏసీబీ విభాగం ఉద్యోగులమని పరిచయం చేసుకున్నారు. ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించగా మీరు లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయని మీపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే నగదు ఇవ్వవలసి ఉంటుందని బెదిరించారు. దీంతో సుబ్బుతాయి సిబ్బందిని పిలిచి ఆ ఇద్దరిని ఆవడి పోలీసులకు అప్పగించారు. ఆవడి పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. విచారణలో వారు అంబత్తూరు అయప్పాక్కంకు చెందిన మోహన్‌రాజ్, విజయలక్ష్మి పురంకు చెందిన వేలాయుధం అని తెలిసింది.