‘ఖాకీ’ ఓవరాక్షన్‌

Traffic Police over action - Sakshi

రోడ్డుపై వాహనం నిలిపారని పాస్టర్‌పై చేయిచేసుకున్న సీఐ 

పెద్దపల్లి రూరల్‌: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌ వివాదాస్పదమైంది. రహదారి పక్కనే వాహనాన్ని నిలుపుతారా అంటూ మంగళవారం ఓ పాస్టర్‌పై పోలీసులు దాడి చేయడం.. వాహనం టైరులో నుంచి గాలి తీసి అత్యుత్సాహం ప్రదర్శించడం గొడవకు దారితీసింది. తన భర్తను ఎందుకు కొడతావంటూ పోలీసులను పాస్టర్‌ భార్య నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని అబ్దులాపూర్‌ మెట్ట ప్రాంతానికి చెందిన పాస్టర్‌ అశోక్‌కుమార్‌ కుటుంబంతో కలసి మారుతివ్యాన్‌లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని క్రైస్తవ ప్రార్థన మందిరానికి వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో పెద్దపల్లిలోని కమాన్‌ప్రాంతంలో టిఫిన్‌ చేసేందుకు ఆగారు.

ఇంతలో అటుగా వచ్చిన ట్రాఫిక్‌ సీఐ బాబురావు, ఇతర సిబ్బంది వాహనం తీయాలని ఆదేశించారు. వాహనంలోనే కూర్చుని చంటి పిల్లలకు టిఫిన్‌ తినిపిస్తున్న అశ్విని తొందరలోనే వెళతామని చెప్పినా వినిపించుకోని ట్రాఫిక్‌ పోలీసులు అత్యుత్సాహంతో వాహనం టైరులోని గాలి తీశారు. గాలి తీయొద్దు.. వెళ్లిపోతామంటూ బతిమాలిన అశోక్‌కుమార్‌పై చేయి చేసుకున్నారు. తన భర్తపై ఎందుకు చేయి చేసుకుంటారంటూ అశ్విని తిరగబడింది. ఆగ్రహం చెందిన పోలీసులు.. అశోక్‌కుమార్‌తోపాటు వారిబంధువులు గండయ్య, అనిల్, అశ్విని, ఇద్దరు చిన్నపిల్లలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గాలిలేని వ్యాన్‌ను పోలీసులే నెట్టి పక్కకు తరలించారు. ట్రాఫిక్‌ పోలీసులు అనుసరించిన తీరుపై అశ్విని తీవ్రంగా మండిపడ్డారు. తాము ఏ నేరం చేశామని చేయి చేసుకుంటారని అధికారులను ప్రశ్నించింది. పార్కింగ్‌ స్థలం చూపితే వాహనాన్ని అక్కడే నిలిపేవారమని, నిబంధనలను పాటించలేదని భావిస్తే జరిమానా విధించాలే కానీ ఎందుకు చేయిచేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా పెద్దపల్లి కమాన్‌ ప్రాంతంలో జరిగిన వ్యవహారంలో మోటారు చట్ట ప్రకారం జరిమానా విధించి వదిలేశామన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top