కూలిన బతుకులు

Tractor Accident In Nalgonda - Sakshi

రెక్కాడితేనే గాని డొక్కాడని జీవితాలు వారివి. రోజూ పొట్ట చేతపట్టుకుని కూలికి వెళ్తేనే ఐదు వేళ్లు నోట్లోకి వెళ్తాయి. రోజూమాదిరిగానే ఉదయం ట్రాక్టర్‌లో కూలికి బయలు దేరి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చివ్వెంల మండలం వల్లభాపురం గ్రామ శివారులో శుక్రవారం ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తాపడడంతో ఇద్దరు కూలీలు మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రత్యక్షసాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 

చివ్వెంల (సూర్యాపేట) : ఆత్మకూర్‌.ఎస్‌ మండలం కందగట్ల సమీపంలో ఉన్న మంగళితండాకు చెందిన లకావత్‌ సుందర్‌(35), లకావత్‌ సంగు (50), లకావత్‌ అమర్‌సింగ్, జాటోత్‌ గోగ్యా, లునావత్‌ గణేశ్, లునావత్‌ నాగు, బోడ శ్రీను, జాటోత్‌ మల్సూర్, మరొకరు నెల రోజులుగా విద్యుత్‌శాఖలో ఓ ప్రైవేట్‌ ఏజెన్సీలో విద్యుత్‌స్తంభాలు పాతేందుకు రోజు కూలీగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో రోజూమాదిరిగానే చివ్వెం ల మండలం తిరుమలగిరి గ్రామంలో ఓ రైతు వ్యవసాయ భూమిలో విద్యుత్‌ స్తంభాలు పాతేం దుకుగాను బయలుదేరారు. మంగళితండా గ్రా మానికి చెందిన రామ్మూర్తి ట్రాక్టర్‌లో తొమ్మిది మంది కూలీలు బయలుదేరారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పది విద్యుత్‌ స్తంభాలను ట్రాక్టర్‌లో లోడ్‌చేసి తిరుమలగిరికి బయలుదేరారు. ట్రాక్టర్‌ను రామ్మూర్తి నడపాల్సి ఉండగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డి తాను ట్రాక్టర్‌ నడుపుతానని తన బైక్‌ రామ్మూర్తిని తీసుకుని రమ్మని చెప్పి ట్రాక్టర్‌ను తొలుకుంటూ వెళ్లాడు.

మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో విజ యవాడ–హైదరాబాద్‌ రహదారిపై ట్రాక్టర్‌ అటుఇటు కదలడంతో ఒక్కసారిగా రోడ్డుకింది వైపునకు ట్రాక్టర్‌ మలిపేందుకు ప్రయత్నించగా స్తంభాలు ఒరగడంతో వెనుక ట్రక్కు బోల్తా పడింది. దీంతో స్తంభాలపై కూర్చున్న తొమ్మిది మంది కిందపడడంతో వారిపై నుంచి విద్యుత్‌ స్తంభాలు పడ్డాయి. దీంతో లునావత్‌ సుందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108వాహనంలో సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించా రు. అక్కడ చికిత్స పొందుతూ లునావత్‌ సంగు మృతి చెందారు. నలుగురి  పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

కాగా వీరిలో అమర్‌సింగ్‌ నడుములు విరిగి కడుపులో తీవ్ర రక్తస్రావం కావడంతో అతని పరిస్థితి పూర్తి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ సీహెచ్‌.నరేష్‌లు సం ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. స్థానికుల సహాయంతో ట్రాక్టర్, విద్యుత్‌ స్తంభాలను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బాధితుడు  లునావత్‌ గణేశ్‌ ఫిర్యాదు మేరకు డీఎస్పీ నాగేశ్వర్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సీహెచ్‌.నరేష్‌ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. మృతులిద్దరికీ ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. 

క్షతగాత్రులకు ఎంపీ, కలెక్టర్‌ పరామర్శ
సూర్యాపేట ఏరియాస్పత్రిలో ప్రమాద బాధితులను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, సూర్యాపేట కలెక్టర్‌ కె.సురేంద్రమోహన్‌లు పరామర్శించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించే క్రమంలో దగ్గరుండి 108 వాహనంలో హైదరాబాద్‌కు తరలింపజేశారు.

ఉస్మానియా ఆస్పత్రిలో క్షతగాత్రులకు మంత్రి పరామర్శ
సూర్యాపేట క్రైం : ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో గాయపడిన క్షతగాత్రులను శుక్రవారం హైదరా బాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన లునావత్‌ సంగు, లకావత్‌ సుందర్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే ప్రమాదంలో గాయపడి సూర్యాపేట ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి యోగక్షేమాలను టీఆర్‌ఎస్‌ శ్రేణుల ద్వారా తెలుసుకున్నారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top