అంబులెన్స్‌లో ఆవుల దొంగతనం 

Thieves Stealing a Cow In Ambulance - Sakshi

ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు  

పట్టించిన సీసీ కెమెరాల ఫుటేజీ  

రూ.7.5 లక్షల నగదు స్వాధీనం  

సాక్షి, హైదరాబాద్‌: ఆవుల దొంగతనానికి అంబులెన్స్‌ను వినియోగించిన నిందితులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.7.5 లక్షల నగదు, ఒక ఆవు, అంబులెన్స్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని చిలకలగూడ ఠాణాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరమండలం డీసీపీ సుమతి, గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ డీఐ నర్సింహారాజు, డీఎస్‌ఐ వెంకటాద్రిలు వివరాలు వెల్లడించారు. మేడిబావికి చెందిన మల్లేష్‌యాదవ్, రాజుయాదవ్‌లు మేతకు వెళ్లిన రెండు ఆవులు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. అదే తరహాలో మరో రెండు సంఘటనలు జరగడంతో డిటెక్టివ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కుత్‌బుద్దీన్‌గూడకు చెందిన మహ్మద్‌ అయూబ్‌ అలియాస్‌ బడాఅయూబ్‌ (57) కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి పాతబస్తీ బార్కస్‌లోని నెబీల్‌ కాలనీలో నివసిస్తున్నాడు. వృతిరీత్యా ఆటో డ్రైవరైన ఆయూబ్‌ ప్రవృత్తి దొంగతనాలు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, మెదక్‌ జిల్లాలో 150 కేసుల్లో అయూబ్‌ నిందితుడు. లారీ దొంగతనం కేసులో అరెస్ట్‌ అయి ఈ ఏడాది ఫిబ్రవరి 16న విడుదలయ్యాడు. తన సోదరుడు బాబా, తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్‌ సద్దామ్‌ ఖురేషీ (27)తో జత కట్టాడు. మేతకు వదిలిన పశువులను దొంగిలించి అమ్ముకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా నగరంలోని పలు ఠాణాల పరిధిలో మొత్తం 39 పశువులను దొంగిలించారు.  

ఓఎల్‌ఎక్స్‌లో అంబులెన్స్‌ కొనుగోలు...   
పశువుల దొంగతనానికి అంబులెన్స్‌ అయితే ఎవరికీ అనుమానం రాదని, ఫుట్‌బోర్డు కిందికి ఉండడంతో వాటిని సులభంగా ఎక్కించొచ్చని భావించారు. యశోద ఆస్పత్రికి చెందిన ఓ అంబులెన్స్‌ను ఓలెక్స్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసిన వ్యక్తిని గుర్తించిన ఈ గ్యాంగ్‌... అధిక మొత్తం చెల్లించి దాన్ని కొనుగోలు చేసింది. 

ఆరెంజ్‌ రంగుతో చిక్కారు.. 
సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు  ప్రారంభించగా, అంబులెన్స్‌ నంబర్‌ ఏపీ 29గా మాత్రమే ఉంది. నగరంలో ఆ నెంబర్‌ అంబులెన్స్‌లు 200 లకు పైగా ఉన్నట్లు తేలింది. ఓ దృశ్యం లో అంబులెన్స్‌ అరెంజ్‌ కలర్‌లో కనిపించింది. ఆ రంగు అంబులెన్స్‌లు కేవలం యశోద ఆస్పత్రి మాత్రమే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలా దొంగలను పోలీసులు పట్టుకున్నారు.    

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ సుమతి, వృత్తంలో నిందితులు  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top