మామను నమ్మించేందుకే..

Thief Captured - Sakshi

ఆస్తిని దక్కించుకోవాలని దొంగతన

పోలీసు వాహనాన్ని అపహరించిన నిందితుల అరెస్ట్‌..రిమాండ్‌

పేటకు చేరుకున్నపోలీసు వాహనం

పోలీసులను అభినందించిన ఎస్పీ

సూర్యాపేట క్రైం : సినిమాల్లో మామను నమ్మించేందుకు అనేక జిమ్మిక్కులు చేస్తుంటారు.. అలాంటి ఘటనే రియల్‌ జీవితంలో చేశాడు ఓ వ్యక్తి.  ఓ అల్లుడు మామను నమ్మించేందుకు ఇక్కడ పోలీసులకు సినిమా చూపించాడు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగతనానికి గురైన సూర్యాపేట రూరల్‌ సీఐ వినియోగిస్తున్న (టీఎస్‌09పీఏ1568) నంబరు గల వాహనం రికవరీ సమయంలో ఆసక్తి గల విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో దొంగతనానికి గురైన సీఐ వాహనంతో పాటు నిందితులు తిరుపతి లింగరాజు, నీరుడు అశోక్‌లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. ఆదివారం పోలీసు వాహనంతో పాటు చోరీకి పాల్పడిన నిందితులు లింగరాజు, అశోక్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

శనివారం జిల్లా కేంద్రంలో సీఐ ప్రవీణ్‌కుమార్‌ వినియోగిస్తున్న సుమో వాహనాన్ని సూర్యాపేటకు చెందిన తిరుపతి లింగరాజు  సీఐ డ్రైవర్‌ సైదులుకు సీఐ స్టేషన్‌కు వెళ్లమంటున్నారంటూ సుమోను దొంగిలించాడు. ఖమ్మం జిల్లా చింత కాని మండలం జగన్నాథపురానికి చెందిన నీరుడు అశోక్‌ను ఎక్కించుకొని తీసుకెళ్లాడు.  మునగాల మీదుగా కోదాడ నుంచి చింతకాని మండలంలోని జగన్నాథపురంలోని తన అత్తగారి గ్రామానికి వాహనాన్ని తీసుకెళ్లాడు.

అయితే లింగరాజు గతంలో మున్సి పల్‌ కార్యాలయంలో పనిచేసేవారు. కొద్ది కాలం క్రితం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడంతో జల్సాలకు అలవాటు పడి తిరుగుతున్నాడు. వివాహ సమయంలో లింగరాజుకు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ స్థలం రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని మామ చెప్పి చేయించడం లేదు. ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతున్న రాజు స్థలాన్ని అమ్ముకుంటాడేమోనని.. మామ రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంతో.. తనకు పోలీసు శాఖలో ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్‌లో చెప్పాడు.

మామను నమ్మించాలంటే ముందుగా.. ఏం చేయాలో పాలుపోక.. జిల్లా కేంద్రంలో సీఐ వాహనాన్ని దొంగిలించి నేరుగా అత్తగారి స్వగ్రామమైన జగన్నాథపురానికి తీసుకెళ్లి.. సీఐ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నానని చెప్పి..అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జగన్నాథపురం గ్రామం నుంచి సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులోకి ప్రవేశించిన లింగరాజుతో పాటు వాహనాన్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అదే విధంగా ఇటీవలి కాలంలో లింగరాజు పోలీసు కానిస్టేబుల్‌నంటూ.. ఓ బైక్‌ను అడ్డగించి ఎలాంటి పత్రాలు లేవంటూ.. స్టేషన్‌కు వెళ్లాలంటూ.. బైక్‌ను దొంగిలించాడు. దొంగిలించిన బైక్‌ను పాలేరులో తాకట్టు పెట్టాడని.. దానిని కూడా రికవరీ చేశామని తెలిపారు.

చోరీకి గురైన వాహనాన్ని సూర్యాపేటకు తీసుకువచ్చామని.. దానిని స్వాధీనం చేసుకుని.. నిందితులు లింగరాజు, నీరుడు అశోక్‌లపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐలు శివశంకర్, ప్రవీణ్‌కుమార్, అఖిల్‌జమా, ఎస్‌ఐ జానకిరాములు, సిబ్బంది చనగాని వెంకన్నగౌడ్, గోదేషి కరుణాకర్, గొర్ల కృష్ణ, గురుస్వామి, జాఫర్, శ్రీనివాస్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

మార్గమధ్యలో పోలీసునంటూ బెదిరింపు 

లింగరాజు కోదాడ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్ల నిర్వాహకులను బెదిరింపులకు గురిచేశాడు. అంతేకాకుండా ట్రిపుల్‌ రైడింగ్‌ బైక్‌పై వెళ్తున్న వారిని అడ్డగించి వారి వద్ద ఉన్న బీరు కాటన్లను స్వాధీనం చేసుకొని సుమోలో వేసుకునిపోయారు. అదే విధంగా మరికొన్ని చోట్ల పెద్ద మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో నగదు వసూళ్లకు పాల్పడ్డారు. 

పోలీసులను అభినందించిన ఎస్పీ జాదవ్‌

జిల్లా కేంద్రంలో సీఐ వినియోగిస్తున్న వాహనం చోరీకి గురి కాగానే.. జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగానే హోం గార్డు స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా ఉండి నాలుగు గంటల సమయంలోనే వాహనాన్ని స్వాధీనం చేసే విధంగా సహకరించినందుకు గాను ఎస్పీ జాదవ్‌ అభినందించారు. అదే విధంగా ఖమ్మం, కృష్ణా, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top