అమ్మే హక్కుంది... విక్రయించలేదు!

There Is Chance Of Arrest of Ravi Prakash Today By Cyberabad Police - Sakshi

 విచారణలో రవిప్రకాశ్‌ పొంతన లేని సమాధానాలు

పోలీసులకు చుక్కలు చూపిస్తున్న టీవీ–9 మాజీ సీఈవో

నేడు డాక్యుమెంట్లు తేవాలని పోలీసుల ఆదేశం

రవిప్రకాశ్‌ అరెస్టు దిశగా పావులు

సాక్షి, హైదరాబాద్‌: టీవీ–9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్‌ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులకు చుక్కలు చూపించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ విషయం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని తెలిసింది. శుక్రవారం 6 గంటల పాటు ప్రశ్నించినా రవిప్రకాశ్‌ నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో శనివారం సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ రవిప్రకాశ్‌ను ఇంటికి పంపారు. టీవీ–9 కొత్త యాజమాన్యానికి లోగో దక్కకూడదనే కుట్రతోనే రవిప్రకాశ్‌ ఈ వ్యవహారం నడిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

రూ.99 వేలకు టీవీ–9 లోగోను మోజో టీవీకి అక్రమంగా విక్రయించినట్లు ఫోర్జరీ పత్రాలు, తప్పుడు సంతకాలతో మోసం చేశాడంటూ అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు గత నెలలో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రవిప్రకాశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా రవిప్రకాశ్‌కు ‘సీఆర్‌పీసీ 41 (ఎ)’సెక్షన్‌ కింద 2 నోటీసులు జారీ చేశారు. మొదటి నోటీసును బేఖాతరు చేసిన రవిప్రకాశ్‌ గురువారం అందుకున్న రెండో నోటీసుతో దిగివచ్చాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఏసీపీ కేఎస్‌ రావ్, ఇన్‌స్పెక్టర్‌ కళింగ్‌రావుతో కూడిన బృందం ఆయన్ను వివిధ కోణాల్లో ప్రశ్నించింది.

టీవీ–9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టాలని కుట్ర పన్నారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి మౌనమే సమాధానమైంది. లోగోను ఎలా విక్రయించారనే ప్రశ్నకు ‘అది నా సంస్థ. ఆ హక్కు నాకు ఉంది’అంటూ సమాధానం ఇచ్చారని తెలిసింది. దీంతో తీవ్రంగా స్పందించిన పోలీసులు అదే నిజమనుకున్నా... రూ.100 కోట్ల విలువైన సంస్థ లోగోను కేవలం రూ.99 వేలకే అమ్మారంటే నమ్మవచ్చా? అని ప్రశ్నించగా... తాను ఎవరికీ విక్రయించలేదంటూ చెప్పిన రవిప్రకాశ్‌ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు.

సాయంత్రం వరకు విచారించి ఆపై ఆ వ్యవహారానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను తీసుకుని శనివారం రమ్మని పంపారు. శుక్రవారం నాటి విచారణలో రవిప్రకాశ్‌ నుంచి సరైన సమాధానాలు రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క అటు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు, ఇటు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ పోలీసుల విచారణలను తప్పించుకోవడానికి రవిప్రకాశ్‌ మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు అందుకు చెక్‌ చెప్పడానికి రవిప్రకాశ్‌ గతంలో అజ్ఞాతంలో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎలా తలదాచుకున్నారు? సహకరించింది ఎవరు? అనే అంశాలను సాంకేతికంగా సంగ్రహిస్తున్నట్లు సమాచారం.  

రవిప్రకాశ్‌ అరెస్టు నేడు! 

ఫోర్జరీ, నిధుల మళ్లింపు వ్యవహారంలో పోలీసులు కేసు వేగవంతం చేశారు. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా కూడా అడిగిన పోలీసులు శనివారం అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నారు. గురువారం సైబరాబాద్‌ పోలీసు విచారణ సందర్భంగా రవిప్రకాశ్‌ పోలీసులనే బెదిరించడం సంచలనం రేపుతోంది. ‘‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏదో ఒక రోజు మీకు టైం వస్తుంది’’అని బెదిరించే ప్రయత్నం చేయడం గమనార్హం. పోలీసులపై పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తూ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నాడన్న కారణంతో సైబరాబాద్‌ కమిషనరేట్‌లో పోలీసులు మీడియా పాయింట్‌ను ఎత్తేశారు. దీంతో రవిప్రకాశ్‌ నేరుగా తమపైనే బెదిరింపులకు దిగాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ పరిణామంతో సీరియస్‌ అయిన పోలీసులు సీపీ సజ్జనార్‌తో సమావేశమై, అరెస్టు విషయమై చర్చించారని సమాచారం.
 
ఫోర్జరీ ఆరోపణ అంగీకారం.. 

మొత్తం 3 రోజుల సైబరాబాద్‌ విచారణలో రవిప్రకాశ్‌ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఫోర్జరీ కేసులో సంతకాన్ని తానే ఫోర్జరీ చేసినట్లు అంగీకరించాడు. ఎలా ఫోర్జరీకి పాల్పడిందీ.. పోలీసులకు వివరించాడు. ఈ పనికి ఎందుకు పాల్ప డ్డావంటే మాత్రం సమాధానం దాటవేశాడు. అతని మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు పోలీసులు నిందితుడి చేతిరాతను సేకరించారు. ఫోర్జరీ కేసులో ఈ చేతిరాతను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. విచారణనంతా పోలీ సులు వీడియో రికార్డింగ్‌ చేశారు. మొత్తానికి ఈ కేసులో శనివారం పలు కీలక మలుపులు చోటుచేసుకోనున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top