11మంది సీపీఎం కార్యకర్తలకు జీవితఖైదు

Thalassery District Court Sentenced Life Term For 11 CPM Workers - Sakshi

తిరువనంతపురం : సీపీఎం పార్టీకి చెందిన 11 మంది కార్యకర్తలకు కేరళలోని తలస్సెరీ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. 2008లో బీజేపీ కార్యకర్త మహేశ్‌ హత్య కేసులో నిందితులగా ఉన్న వీరిని దోషులుగా గుర్తించిన కోర్టు గురువారం శిక్ష ఖరారు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో నడుపుతూ జీవనం సాగించే మహేశ్‌ తొలుత సీపీఎం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. ఆ తర్వాత అతడు బీజేపీలో చేరాడు. అది జీర్ణించుకోలేకపోయిన కొంతమంది సీపీఎంకు చెందిన కార్యకర్తలు అతనిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.

2008 మార్చి 6వ తేదీన పథకం ప్రకారం మహేశ్‌పై దాడికి దిగి అతన్ని హతమార్చారు. ఆ తర్వాత తలస్సెరీ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ కేసుపై సుదీర్ఘ కాలంపాటు విచారణ జరిపిన కోర్టు సీపీఎం పార్టీకి చెందిన ధనేశ్‌, ఉత్తమన్‌, బాబు, ప్రకాశన్‌, ఉమేశ్‌,  రంజిత్‌, ముకేశ్‌, పురుషోత్తమన్‌, సునేశ్‌, సూరజ్‌, శిజులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top