ఆ సూసైడ్‌ నోట్‌ అర్థమెంటీ..?

Tenth Class Student Commits Suicide In Jagtial - Sakshi

వాల్మీకి ఆవాస విద్యార్థి మృతిపై అనుమానాలెన్నో..

హత్య అంటున్న మృతుడి కుటుంబ సభ్యులు

ఆత్మహత్యే అంటున్న పాఠశాల యాజమాన్యం

సాక్షి, జగిత్యాల: అసలేం జరిగింది..? ఈనెల ఒకటో తేదిన జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ పదో తరగతి విద్యార్థి రుద్రారపు దినేశ్‌ (15) ఆత్మహత్యా చేసుకున్నాడా..? లేదా ఎవరైనా హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకునేంత పెద్ద తప్పు దినేశ్‌ ఏం చేశాడూ..? అసలు అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి..? ఎందుకొచ్చింది..? ఇప్పుడీ చర్చ జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీవాల్మీకి ఆవాసంలో ఉంటూ చదువుకుంటున్న తమ బిడ్డది ముమ్మాటికీ హత్యే అని.. హత్యా కేసు నమోదు చేయాలని దినేశ్‌ కుటుంబ సభ్యులు చెబుతుంటే.. ఆవాసం నిర్వాహకులు మాత్రం దినేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేస్తున్నారు.

ఇటు మృతదేహానికి పోస్టుమార్టం చేసిన జగిత్యాల ప్రభుత్వాస్పత్రి వైద్యులు ముందు దినేశ్‌ది హత్యే అని చెప్పి తర్వాత ఆత్మహత్య అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో కేసును ఎలా నమోదు చేయాలో తెలియక పోలీసులు చివరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. దినేశ్‌ చనిపోవడానికి ఓరోజు ముందు పాఠశాలకు ఓ మహిళా వచ్చిందని, ఆమెను చూసి భయపడే మరుసటి రోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆవాసం నిర్వాహకులు చెప్పారు. పాఠశాలకు వచ్చిన ఆ మహిళా ఎవరు..? ఎందుకొచ్చింది..? దినేశ్‌తో ఏమైనా మాట్లాడిందా..? ఆ మాటలకు భయపడే దినేశ్‌ ఉరి వేసుకున్నాడా..? అసలు దినేశ్‌ ఉరి వేసుకునేంత పెద్ద తప్పు ఏం చేశాడనేది సదరు మహిళే సమాధానం చెప్పాల్సి ఉంది.

సూసైడ్‌ నోట్‌ అర్థమెంటీ..?
దినేశ్‌ చావడానికి ముందు సూసైడ్‌నోట్‌ రాసినట్లు తెలుస్తోంది. ఆ నోట్‌లో ‘ఆచార్యా నేను అలా చేయలేదు.. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను తప్పు చేయనిదానికి తప్పు చేసిన అంటే బాగా అనిపియలేదు. అందుకే ఇలా చేస్తున్నాను..’ అని ఉంది. ఇందులో దినేశ్‌తో ఆచార్య ఏ తప్పు గురించి ప్రస్తావించాడు..? దినేశ్‌ ఏ తప్పు చేశాడని ఆచార్య చెప్పాడు..? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. అయితే.. సదరు ఆవాసం నిర్వాహకుడు (ఆచార్య) మాత్రం దినేశ్‌ తనతో ఏ తప్పు గురించి ప్రస్తావించలేదని చెప్పడం గమనార్హం. మరోపక్క.. తరగతి గదిలో ఉరి వేసుకున్న తీరుపైనా కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దినేశ్‌ చనిపోతే ఉరికి వేలాడి ఉండాలి కానీ ఉరి వేసుకున్న వైరు తెగి.. దినేశ్‌ కింద పడి ఉండడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై జగిత్యాల పట్టణ సిఐ రత్నపురం ప్రకాశ్‌ వివరణ ఇస్తూ.. ‘తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని, స్కూలుకు వచ్చిన ఆ మహిళ, ఆచార్య, సహచర విద్యార్థులు, పలువురు సార్లను విచారించాలని దినేశ్‌ తండ్రి రుద్రారపు రాజనర్సయ్య మాకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు విచారణ చేపడుతున్నాం’ అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top