ఘరానా మోసం!

Tekkali Paster Fraud With Vehicle Offers in Srikakulam - Sakshi

30 శాతం రాయితీపై వాహనాలు అంటూ నమ్మించిన వైనం

టెక్కలి, హైదరాబాద్‌లో బ్రాంచీలు

పేద, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగస్తులే లక్ష్యం  

రూ.కోట్లు స్వాహాకు పన్నాగం

ప్రభుత్వ ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకున్నాడు. పలువురిని నమ్మించి 30 శాతం రాయితీతో వాహనాలను విక్రయించాడు. వారు మరికొంత మందికి చెప్పటంతో మోసం మొదలుపెట్టాడు. ఈ నకిలీ పథకం అంతటా వ్యాపించడంతో వ్యాపారం మరింత పెరిగింది. సుమారు 110 వాహనాలను విక్రయించాడు. రూ.కోట్లలో వ్యాపారం సాగింది. ప్రస్తుతం గుట్టు రట్టుకావడంతో సదరు వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.  

శ్రీకాకుళం ,టెక్కలి రూరల్‌: టెక్కలి బాలాజీనగర్‌–2లో నివాసముంటున్న జి.హెచ్‌.రాజా అలియాస్‌ తిరుపతిరావు (పాస్టర్‌) గత కొద్ది నెలలుగా టెక్కలితోపాటు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, సారవకోట, నరసన్నపేట, జలుమూరు తదితర మండలాల ప్రజలకు 30 శాతం రాయితీతో నచ్చిన వాహనం విక్రయిస్తానని నమ్మబలికాడు. కొంత కాలం తర్వాత వాహనాలు కావాలనుకునే వారికి నెల రోజల వ్యవధిలో ఇస్తామని చెప్పేవాడు. సుమారు 216 మంది వరకు వాహనాల కోసం డబ్బులు చెల్లించారు. కొంతమందికి వాహనాలు ఇస్తామన్న సమయానికి ఇవ్వకపోడంతో ప్రశ్నించారు. నోయిడాలోని మొయిన్‌ బ్రాంచ్‌ నుంచి తన వద్దకు వాహనాలు రాలేదని, వచ్చిన వెంటనే  ఇస్తానని చెప్పాడు. సుమారు రూ.3 కోట్ల 20 లక్షల వరకు వసూలు చేశాడని తెలుస్తోంది. ప్రజల వద్ద సేకరించిన డబ్బులతోనే కొన్నొ వాహనాలు కొనుగోలు చేసేవాడు. ఎవరైనా పలుకుబడి ఉన్నవారికి వాహనాలు ఇచ్చి వారిని నమ్మించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, నూర్పుడి యంత్రాలు వంటివి 30 శాతం తక్కువ రేటుకు ఇస్తామనడంతో పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఈ నకిలీ స్కీం మాయలో పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి హైదారాబాధ్‌లో కూడా బ్రాంచ్‌ ఉన్నట్లు సమాచారం. దానిని అక్కడ ప్రశాంత్‌కుమార్‌ అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.  చల్ల రాజా ప్రవర్తనపై అనుమానం వచ్చిన సంతబొమ్మాళి గ్రామానికి చెందిన సిమ్మ కృష్ణరావు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కామేశ్వరరావు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  

టెక్కలిలో ఏర్పాటు చేసుకున్న కార్యాలయం  
గుట్టు రట్టు..
రాజా అలియాస్‌ తిరుపతిరావుది పాతపట్నం మండలం తెంబూరు గ్రామం. పదో తరగతి సైతం ఉతీర్ణత చెందలేదు. గ్రామంలో పాస్టర్‌గా ఉన్నారు. గతేడాది వచ్చిన తిత్లీ తుఫాన్‌లో ఇల్లు కూలిపోవడంతో టెక్కలికి వచ్చాడు. ఈ సమయంలోనే హైదారాబాధ్‌లోని ప్రశాంత్‌కుమార్‌తో పరిచడం ఏర్పడింది. ఇరువురు కలిసి ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని ఈ నకిలీ వ్యాపారం గుట్టుగా సాగించారు. ప్రజల వద్ద నుంచి మరింత మొత్తం సేకరించి ఆ సొమ్ముతో వచ్చే ఏడాదిలోగా ఉడాయించేందుకు పక్కా ప్రణాళికలు వేసికున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top