కీచక గురువు..!

Teacher Misbehaviour With Students in machilipatnam - Sakshi

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

అధికారుల విచారణలో వెల్లడి

ఉపాధ్యాయుడు (పీడీ)పై సస్పెన్షన్‌ వేటు

మచిలీపట్నం: విద్యార్థులకు ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధిని చూపించాడు. కన్నబిడ్డల్లాంటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు. మచిలీపట్నం మండలం చిన్నాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.సస్పెండ్‌ ఉత్తర్వులు, డెప్యూటీ డీఈఓ విచారణ నివేదిక మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చిన్నాపురం హైస్కూల్‌లో వ్యాయామ ఉపా«ధ్యాయుడు(పీడీ)గా పనిచేస్తున్న పి. సాంబశివరావు మాస్టారు చేష్టలు , అసభ్యకరమైన ప్రవర్తన శృతిమించడంతో ఆందోళన చెందిన కొంతమంది విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. సదరు వ్యాయామ ఉపాధ్యాయుడి వ్యవహారం తేల్చేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు.

విషయం ప్రధానోపాధ్యాయుడి దృష్టికి రావడంతో ఉన్నతాధికారులకు తెలియజేశాడు. బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడం, ఇదే సమయంలో సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు సెలవులో ఉండటంతో దీనిలో నిజాలు నిగ్గు తేల్చేందుకు మచిలీపట్నం డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణమూర్తి  రంగంలోకి దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇతర సహ ఉపాధ్యాయుల నుంచి జరిగిన పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది బాలికలతో కూడా ఆయన మాట్లాడి వ్యాయామ ఉపాధ్యాయుడి తీరుపై ఆరా తీశారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సాంబశివరావు బాలికలతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని విచారణలో తేలడంతో దీనిపై సమగ్ర నివేదికను డీఈఓకు అందజేశారు.  దిశ ఘటనతో ఓ పక్క దేశవ్యాప్తంగా అట్టుడికిపోతున్న తరుణంలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడంపై జిల్లా విద్యాశాఖాధికారులు తీవ్రంగానే స్పందించారు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడంతో పాటు, ముందస్తు అనుమతులు లేకుండా హెడ్‌ క్వార్టర్‌ను విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు బాలికలతో ఈ రీతిన వ్యవహరించడంపై ఉపాధ్యాయవర్గాల్లో సర్వత్రాచర్చనీయాంశమైంది.  వ్యాయామ ఉపాధ్యాయుడు బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తన విచారణలో తేలిందని డెప్యూటీ డీఈఓ బత్తుల సత్యనారాయణ మూర్తి సాక్షి వద్ద ధ్రవీకరించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top