బిడ్డ కడుపు నింపేందుకు వెళుతూ..

Teacher Died In Bike Accident In Guntur - Sakshi

 రోడ్డు ప్రమాదంలో తల్లి మృత్యువాత

బైక్‌ను ఢీకొట్టిన కంకర లోడు ట్రాక్టర్‌

మైనర్‌ ట్రాక్టర్‌ను నడపడం వల్లే ప్రమాదం? 

 తెనాలిరూరల్‌: విధి నిర్వహణలో ఉన్న ఆ తల్లికి బిడ్డ ఆకలి గుర్తుకొచ్చింది. చిన్నారి కడుపు నింపాలన్న ఆలోచనతో భర్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. ఇంతలో ట్రాక్టర్‌ రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించింది. భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలం కొలకలూరు గ్రామం కోనేటిపురానికి చెందిన కలకండ శేషయ్య, మాధవి భార్యభర్తలు. శేషయ్య సీసీఎల్‌ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తుండగా, వీర మాధవి(28) కొలకలూరులోనే ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల కుమార్తె సునంద తల్లి పని చేస్తున్న పాఠశాలలోనే మొదటి తరగతి చదువుతోంది.

నాలుగు నెలల కిందట వీరికి కుమారుడు యజ్ఞ నాగ వంశీకృష్ణ జన్మించాడు. తమ బంధువు, పిల్లలకు మేనత్త రత్నకుమారి సంరక్షణలో చిన్నారిని ఇంట్లోనే ఉంచి, ఇటీవలి కాలం నుంచే మాధవి తిరిగి పాఠశాలలో విధులకు హాజరవుతోంది. ప్రతి రోజు పాఠశాల నుంచి మధ్యలో ఇంటికి వచ్చి, బిడ్డ ఆకలి తీర్చి వెళుతుండేది. ఈ క్రమంలోనే భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, నందివెలుగు–గుంటూరు రహదారిపై కోనేటిపురానికి సమీపంలోనే ఎదురుగా వచ్చిన కంకర లోడు ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దంపతులిద్దరికీ తీవ్ర గాయాలవ్వగా, స్థానికులు వెంటనే తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మాధవి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. శేషయ్య పరిస్థితి విషమంగా ఉంది.

ట్రాక్టర్‌ను నడిపింది మైనర్‌?
ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను కొలకలూరుకే చెందిన మైనర్‌ బాలుడు నడిపినట్టు తెలుస్తోంది. రెండు నెలల కిందట ప్రభుత్వ సబ్సిడీతో వచ్చిన ట్రాక్టర్‌(రైతు రథం)తో, ఎటువంటి  డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండానే పేరేచర్ల నుంచి కంకరలోడుతో వస్తుండగా, కోనేటిపురం సమీపంలోనే ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు చెబుతున్నారు. తెనాలి మండలం ఖాజీపేట, హాఫ్‌పేట గ్రామాల మధ్య రవాణా అధికారులు వాహన తనిఖీలు చేస్తుండటంతో వారి నుంచి తప్పించుకువచ్చే క్రమంలో వేగాన్ని నియంత్రించలేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని తాలూకా ఎస్‌ఐ ఎం.నారాయణ పరిశీలించారు. బాధితుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top