ఐయామ్‌ వెరీ సారీ!.. నేను చనిపోతున్నా

A Suspicious Dead Body Found On Vijayawada Highway - Sakshi

సాక్షి, విజయవాడ : నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఇన్నర్‌ రోడ్డు... ఖాళీ స్థలాల్లో సగం కాలిన వ్యక్తి మృతదేహం.... ఎవరైనా హత్య చేసి శవాన్ని మాయం చేసేందుకు కాల్చేందుకు ప్రయత్నించారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు.. మృతదేహం చుట్టూ జనం గుమిగూడి... సదరు వ్యక్తిని గుర్తు పట్టేందుకు ప్రయత్నించారు.. మృతదేహానికి దూరంగా రోడ్డుపై ఉన్న బైక్‌లో సెల్‌ఫోన్‌.. ఇంతలో మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. సేకరించిన వివరాల ప్రకారం విద్యాధరపురం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతానికి చెందిన కూరాకుల రమేష్‌ (40) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. రమేష్‌కు ఇంకా వివాహం కాకపోవడంతో తల్లి అప్పలనర్సమ్మతో కలిసి ఉంటున్నాడు. తల్లితో పాటు అన్నయ్య లీలాప్రసాద్‌ తరచూ తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని అడుగుతూ ఉండేవారు. అయినా సరే పెళ్లికి అంగీకరించేవాడు కాదు.

ఈ క్రమంలో గత 12వ తేదీ రమేష్‌ తన అన్నకి ఫోన్‌ చేసి తల్లిని నీ దగ్గర పెట్టుకోవాలని అడిగాడు. ఎందుకని ప్రశ్నించగా నేను ఎవరికి భారం కాకూడదని సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో రమేష్‌ ఫోన్‌ నుంచి అన్నయ్య ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది. తన బైక్‌ను ఇన్నర్‌ రోడ్డులో రైట్‌ సైడ్‌ ఉంచానని, వచ్చి తీసుకువెళ్లాలని.... ఐయామ్‌ వెరీ సారీ... అమ్మ.. విజయ అక్క జాగ్రత్త.. అని ఆ మెసేజ్‌లో ఉంది.

దీంతో అనుమానం వచ్చి ఇన్నర్‌ రోడ్డులోకి వచ్చి చూసేసరికి రోడ్డుపై బైక్‌ ఉంది. బైక్‌ కవర్‌లో ఫోన్‌ కూడా కనిపించింది. కొద్ది దూరం వెళ్లి చూడగా ఖాళీ స్థలంలో సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. పక్కనే చెప్పులు, పెట్రోల్‌ తెచ్చుకున్న బాటిల్, అగ్గిపెట్టె కనిపించాయి. అయితే, మానసిక పరిస్థితి సరిగా లేక రమేష్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా.. అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఘటనపై అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తెల్లవారుజాము నుంచి జన సంచారంతో ఉండే ఇన్నర్‌ రోడ్డులో ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడితే అటుగా వెళ్లే వారు గుర్తించలేకపోయారా.. అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా... లేక ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top