
స్టే గడువు దాటడంతో మళ్లీ సుప్రీం కోర్టు పరిశీలనకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసు..
సాక్షి, న్యూఢిల్లీ : మార్గదర్శి చిట్‌ఫండ్స్ డిపాజిట్ల సేకరణ కేసు వ్యవహారం మరోసారి సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తోందని గతంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మార్గదర్శి యాజమాన్యం స్టే తెచ్చుకుంది.
దిగువ కోర్టుల నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు నుంచి కూడా స్టే తెచ్చుకున్న మార్గదర్శి విచారణ జరగకుండా వ్యవహరించింది. అయితే ముఖ్యమైన కేసులు ఏమైనా ఆరు నెలలకు మించి స్టే ఉండకూడదన్న సర్వోన్నత న్యాయస్ధాన తీర్పుకు అనుగుణంగా మరోసారి ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిశీలనకు వచ్చింది.
మరోసారి స్టే పొడిగించాలన్న సంస్థ అభ్యర్థనను సుప్రీం కోర్టు నిరాకరించడంతో మార్గదర్శికి చుక్కెదురైంది. కాగా ఇదే వ్యవహారంపై అభిప్రాయం కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సుప్రీం నోటీసులు పంపింది.