కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య

Suicide of Katika Reddy Srinivasula Reddy - Sakshi

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైనం 

విషపు గుళికలు మింగి బలవన్మరణం 

కడప అర్బన్‌:  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి సోమవారం సాయంత్రం విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కడప వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (56) ప్రొద్దుటూరులో భార్య పద్మావతితో కలిసి ఉంటున్నాడు. వారికి కుమార్తె హిమబిందు(30), కుమారుడు శరత్‌చంద్ర(26) ఉన్నారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు తనను విచారణకు పిలిచారని, తొలుత కసునూరుకు, తరువాత పులివెందులకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పిన శ్రీనివాసులరెడ్డి సోమవారం ఇంటి నుంచి బయలుదేరి బయటకు వెళ్లాడు. సాయంత్రం కసునూరులోని భర్త బంధువులకు భార్య పద్మావతి ఫోన్‌ చేసింది. కసునూరులోని పొలంలో ఉన్నాడని బంధువుల ద్వారా తెలుసుకుని ఇంటికి తీసుకునిరమ్మని చెప్పింది. కసునూరులో బంధువుల ఇంటికి శ్రీనివాసులరెడ్డిని తీసుకుని రాగానే సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో వాంతులు చేసుకోసాగాడు.

ఈ క్రమంలో భార్యకు ఫోన్‌ చేసి తాను శనగల్లో కలిపే గుళికల మందును మింగానని చెప్పాడు. బంధువులు వెంటనే అతడిని పులివెందులలోని ఆసుపత్రికి తీసుకుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులరెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. భర్త సూసైడ్‌ నోట్‌లో తెలిపిన మేరకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని శ్రీనివాసులరెడ్డి భార్య పద్మావతి పోలీసులను కోరారు.

ఈ మేరకు కడప వన్‌టౌన్‌లో క్రైం నెం.298/2019లో సెక్షన్‌ 174 సీఆర్‌పీసీ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని కడప డీఎస్పీ యు.సూర్యనారాయణ చెప్పారు. శ్రీనివాసులరెడ్డి మృతదేహానికి రిమ్స్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top