జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ల నిరోధానికి ప్రత్యేక నిఘా

Special Task Force For Cricket Bettings In West Godavari - Sakshi

మీ కోసంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌

ఏలూరు టౌన్‌ : జూదం, క్రికెట్‌ బెట్టింగ్‌ నిరోధానికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. క్రికెట్, పేకాట, ఇతర  కేసులు పదికంటే ఎక్కువ నమోదైతే సంబంధిత వ్యక్తిపై రౌడీషీట్‌ తెరుస్తామని హెచ్చరించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విజిబుల్‌ పోలీసింగ్, ప్రత్యేక బీట్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పోలీస్‌ స్టేషన్లలో పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలని, మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు యాంటీ హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. తన కుమార్తెను అపహరించారని దీనిపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భీమవరం నుంచి వచ్చిన ఓ మహిళ కోరారు. వివాహేతర సంబంధం పెట్టుకుని వేధింపులకు గురిచేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆకివీడు నుంచి వచ్చిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని విక్రయిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పెదవేగికి చెందిన ఓ మహిళ ఎస్పీని కోరారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశా>రు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top