మేనత్త ఇంటికే కన్నం

Son in law Arrest in ATM Card Robbery Case Prakasam - Sakshi

ప్రకాశం ,కందుకూరు: అధునాతన బైక్‌ మోజులో పడి ఓ యువకుడు సొంత మేనత్త ఇంటికే కన్నం వేశాడు. మేనత్త డబ్బులతో బైక్‌ అయితే కొన్నాడుగానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాలేటి హైమావతి అనే మహిళ పట్టణంలోని కోటకట్ట వీధిలో నివాసం ఉంటోంది. ఆమె మేనల్లుడు శబరీష్‌. అతడికి సాయి, అన్వీకుమార్‌ అనే పేర్లు కూడా ఉన్నాయి. శబరీష్‌కు ఆధునిక బైక్‌ అంటే మోజు. తాను నచ్చిన బైక్‌ కొనేందుకు మేనత్త ఏటీఎం కార్డును కాజేశాడు. సొంత మేనల్లుడే కావడంతో ఆమె కార్డు పిన్‌ నంబర్‌ శబరీష్‌ తెలుసుకున్నారు. కార్డు తీసుకుని మిత్రులు గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీణ్, దేవర్ల సాయికుమార్‌తో కలిసి సింగరాయకొండ వెళ్లారు. అక్కడ ఏటీఎం సాయంతో రూ.48 వేలు డ్రా చేశారు.

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ విజయ్‌కుమార్‌
అనంతరం నెల్లూరు వెళ్లారు. అక్కడ ద్విచక్ర వాహన షోరూమ్‌కు వెళ్లి కెటిఎం డుకే–2000 బైకు కొన్నాడు. దీనికి రూ.70 వేలు కార్డు ద్వారా స్వైప్‌ చేశారు. బైక్‌కు అన్ని హంగులు అమర్చేందుకు రూ.1,31,000 నగదు పద్మ పూజిత ఫైనాన్స్‌ నుంచి తీసుకున్నారు. ఈ క్రమంలో తన ఏటీఎం పోయిన విషయాన్ని హైమావతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. మేనత్త ఇంట్లో కార్డు దొంగలించిన శబరీష్‌తో పాటు మిగిలిన ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదుతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిలో గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీన్‌ అనే వారు మైనర్‌లు కావడంతో ఒంగోలు జువైనల్‌ కోర్టుకు, మిగిలిన ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ వివరించారు. ఆయనతో పాటు పట్టణ ఎస్‌ఐ కేకే తిరుపతిరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top