ఆగని స్మగ్లింగ్‌..!

Smuggling In Seshachalam Forests - Sakshi

శేషాచలం అడవుల్లో చాపకిందనీరులా ఎర్రచందనం స్మగ్లింగ్‌

నివారించడంలో అటవీశాఖ వైఫల్యం

స్మగ్లింగ్‌కు కేంద్ర బిందువుగా బాలుపల్లి రేంజ్‌

రైల్వేకోడూరు అర్బన్‌: రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చాపకింద నీరులా జరుగుతూనే ఉంది. అందులో బాలుపల్లి రేంజ్‌ కీలకంగా మారింది. ఈ రేంజ్‌ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ గత నాలుగేళ్లుగా యథేచ్ఛగా సాగుతోంది. 20 రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ప్రొటెక్షన్‌ వాచర్లు కూడా పోలీసులకు చిక్కడం గమనార్హం. అడవులపై పూర్తి స్థాయి అవగాహన, ఏ స్మగ్లింగ్‌కు ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి తదితర విషయాలపై పోలీస్, టాస్క్‌ఫోర్స్‌ అధికారులకంటే వీరికే ఎక్కువ అవగాహన ఉంటుంది. పట్టుబడిన స్మగ్లర్ల వెనుక ఎవరున్నారనే విషయాలపై పూర్తి స్థాయి విచారణ జరపకపోవడం వల్ల స్మగ్లింగ్‌ నిరాఘాటంగా కొనసాగుతోందని పలువురు పేర్కొంటున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడంలో అటవీశాఖ వైఫల్యం చెందిందనే అభిప్రాయంతో ప్రభుత్వం పోలీస్‌ శాఖకు అన్ని అధికారాలు ఇచ్చి కొంతకాలానికి ప్రత్యేకంగా ఎర్ర చందనం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కూంబింగ్‌ నిర్వహిస్తున్నా స్మగ్లింగ్‌ మాత్రం ఆగడం లేదంటే దీనికి కారణం  ఇంటి దొంగలేనని చెప్పవచ్చు. ఇటీవల పట్టుబడిన ప్రొటెక్షన్‌ వాచర్ల ఉదంతమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి  ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు కేవలం బాలుపల్లి రేంజ్‌ పరిధిలోనే 45 కేసులు నమోదు చేసి 11వేల 804 కేజీల బరువు గల 510 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 14 మందిని అరెస్ట్‌ చేశారు.   రెండు రోజులక్రితం కూడా 8 దుంగలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారంటే అడవుల్లో స్మగ్లర్లు ఎంతమంది మకాం వేశారో అర్థమవుతోంది. అటవీశాఖలో పని చేస్తున్న ప్రొటెక్షన్‌ వాచర్లు స్మగ్లర్లకు సహకరిస్తున్నారంటే ఇలా ఇంటిదొంగలు ఎందరు ఉన్నారో పై అధికారులు తేల్చాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top