‘వీడియోలే హత్యకు పురిగొల్పాయి’

SIT Reveals Gauri Lankesh Speech Videos Used to Incite Killers - Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్యలో సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) అధికారులు ముగ్గురు కీలక నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా హత్యకు ముందు నిందితులు నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించి సిట్‌ అధికారుల పలు సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ మీడియా వివరాల ప్రకారం... అనుమానితుడు అమోల్‌ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్‌ డిస్క్‌లో హిందుత్వకు వ్యతిరేకంగా మంగళూరులో గౌరీ లంకేశ్‌ మాట్లాడిన  వీడియోలను గుర్తించామని సిట్‌ అధికారులు తెలిపారు.

ఈ వీడియోలను నిందితుడు వాగ్మారే డౌన్‌లోడ్‌ చేశాడని సిట్‌ అధికారులు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్‌ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను పదే పదే చూస్తూ.. తుపాకీ, పెట్రోల్‌ బాంబ్‌ పేల్చడం వంటి విషయాల్లో వాగ్మారే శిక్షణ పొందాడని తెలిపారు. ఈ వీడియోలే గౌరీ హత్యకు పురిగొల్పాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా అమోల్ కాలే డైరీలో గౌరీ లంకేశ్‌తో పాటు మరో 36 మంది ప్రముఖులను హత్య చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడు డైరీలో రాసుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయాలను కోడ్‌ భాషలో రాసుకున్నటు సిట్‌ అధికారులు తెలిపారు.

హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడిన గౌరీ లంకేశ్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ కుమార్‌ అంగీకరించినట్లు వారు పేర్కొన్నారు. గౌరీ లంకేశ్‌ హత్యకోసం వాగ్మారే 3 వేల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు, హత్యకు ముందు రోజు 10 వేల రూపాయలు తీసుకున్నారని విచారణలో వాగ్మారే చెప్పినట్లు సమాచారం. కాగా గౌరీ లంకేశ్‌ హత్య కేసును వాదించడానికి స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా శ్రీశైల వదావదాగిని కర్ణాటక ప్రభుత్వం నియమించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top