
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన విషయంలో సిట్ విచారణ మొక్కుబడిగా సాగుతోంది. నిందితుడు శ్రీనివాస్‌కు ఇచ్చిన ఆరు రోజుల కస్టడీ రేపటి ( నవంబర్ 2)తో ముగియనుంది. గత నాలుగు రోజులుగా సాగిన విచారణలో శ్రీనివాస్ నుంచి చెప్పుకోదగ్గ నిజాలేవీ రాబట్టలేకపోయారు. గతరాత్రి నిందితుడు శ్రీనివాస రావు తల్లిదండ్రులను విచారణ కోసం సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. రాత్రి రెండు గంటలపాటు విచారించినట్టు తెలుస్తోంది. ఇవాళ కూడా శ్రీనివాస్‌తో పాటు అతని తల్లిదండ్రులను విచారించనున్నారు.
ఈ క్రమంలో హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 35మందిని పోలీసులు విచారించారు. శ్రీనివాస్ కాల్‌డేటాపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాస్ కస్టడీ రేపటితో ముగిస్తుండటంతో కస్టడీని పొడిగించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు వేసే అవకాశమున్నట్లు సమాచారం. వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ పరిమితికి మించి ఎయిర్‌పోర్ట్ పాస్‌లను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఐఎస్‌ఎఫ్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.