మరికొన్ని ‘ఐటీ గ్రిడ్స్‌’ హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం

SIT Handover Hard Disks From IT Grids Scam - Sakshi

కార్యాలయంలో మళ్లీ సోదాలు.. 

సంస్థ డైరెక్టర్‌ అరెస్ట్‌ కోసం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు తెలంగాణ ప్రజల డేటాను కూడా చోరీ చేసిన టీడీపీ యాప్‌ (సేవామిత్ర) తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌పై నమోదైన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వేగం పెంచింది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో శనివారం కూడా సిట్‌ బాస్, ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో మరోసారి సోదాలు నిర్వహించారు. సిట్‌ అధికారులు శ్వేతారెడ్డి, రోహిణీరెడ్డిల సమక్షంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో సాంకేతిక ఆధారాల సేకరణ కోసం క్లూస్‌ టీంను కూడా రంగంలోకి దించారు. ఈ సందర్భంగా మరికొన్ని హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందన్నారు.

సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ కోసమే ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. పరారీలో ఉన్న సంస్థ డైరెక్టర్‌ అశోక్‌ గూగుల్, అమెజాన్‌లో దాచిన క్లౌడ్‌ డేటాను సేకరించేందుకు ఆ రెండు కంపెనీలకు లేఖ రాశామని, వాటి నుంచి ఇంకా సమాధానం రావాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఆ కంపెనీల స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లను కోర్టులో ప్రవేశపెట్టి తరువాత ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతామన్నారు. అశోక్‌ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పైనా రవీంద్ర స్పందిస్తూ ఈ అంశంపై తాము కూడా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎస్సార్‌ నగర్‌లో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉందని, అవి రాగానే దానిపైనా దర్యాప్తు మొదలుపెడతామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top