
భువనేశ్వర్(ఒడిశా): కొరాపుట్ గ్యాంగ్‌రేప్ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు చల్లారకమునుపే అలాంటిదే మరో దారుణం చోటుచేసుకుంది. గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని చెరబట్టిన ఆరుగురు దుండగులు ఆమె కాబోయే భర్త ఎదుటే అత్యాచారానికి ఒడిగట్టారు. భాంజానగర్‌కు చెందిన డిగ్రీ చదువుకుంటున్న యువతి, కాబోయే భర్తతో కలిసి సోమవారం మధ్యాహ్నం గంగాపూర్ సమీపంలోని బుధకేందూ థాకూరాణి ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం వారిద్దరూ బైక్‌పై వస్తుండగా రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన ఆరుగురు దుండగులు వారిని అడ్డగించారు. యువకుడిని తీవ్రంగా కొట్టి, ఇద్దరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువతిపై రేప్‌నకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలను తమ సెల్‌లో చిత్రీకరించారు. అనంతరం వారిద్దరినీ వదలి వెళ్లిపోయారు.
దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ఆశిష్ సింగ్ వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో ముందు హాజరుపరిచారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఇదిలా ఉండగా, కొరాపుట్‌లో తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ నెల 10వ తేదీన భద్రతా సిబ్బంది వేషధారణలో ఉన్న నలుగురు దుండగులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.