ఏడో భార్యని వదిలించుకునేందుకు యత్నం | Sakshi
Sakshi News home page

భర్త ఇంటి ముందు ఏడో భార్య నిరసన

Published Fri, Apr 20 2018 8:52 AM

The seventh wife's protest for justice - Sakshi

యలమంచిలి: న్యాయం కోసం మరోసారి ఆ ఇల్లాలు రోడ్డెక్కింది. భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బూరుగుపల్లి పంచాయతీ మట్టవానిచెరువులో గురువారం జరిగింది. అసలేం జరిగిందంటే.. గ్రామానికి చెందిన చెల్లుబోయిన ఆంజనేయులు ఇప్పటివరకూ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. గ్రామస్తులకు తెలిసి రెండు, తెలియకుండా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

ఏడో భార్య దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన లక్ష్మిని గతేడాది గర్భిణిగా ఉన్నప్పుడు వదిలించుకోవడానికి యత్నించాడు. దీంతో ఆమె సంఘ పెద్దల సాయంతో భర్త ఇంటిముందు ఆందోళన చేపట్టింది. ఈ విషయం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో అప్పట్లో సంచలనమైంది. దీంతో సంఘ పెద్దల చొరవతో  పుట్టే బిడ్డకు అరెకరం పొలం, రూ.లక్ష నగదు, ఇంటిలో వాటా ఇచ్చేందుకు ఆంజనేయులు అంగీకరించాడు.

అయితే పొలం రాశాడు కానీ నగదు, ఇల్లు ఇవ్వలేదు. ఈ ఏడాది కాలంలో భార్యను వదిలించుకోవడానికి అనేకసార్లు యత్నించినా ఆమె సంఘ పెద్దల సాయంతో నెట్టుకొచ్చింది. దీంతో అతను రెండు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిపోవడంతో లక్ష్మి తల్లిని తోడుగా తెచ్చుకుని భర్త మొదటి భార్య కుమారుల పేరిట ఉన్న ఐదెకరాల భూమిని అప్పు చేసి సాగు చేసుకుంది. ఇటీవలే కోత కూడా కోయించింది.

ఇప్పుడు మరో నాటకం 

పంట చేతికి వచ్చిందని తెలుసుకున్న ఆంజనేయులు బుధవారం తన చెల్లి చంద్రావతి, మేనల్లుళ్లు జక్కంశెట్టి వెంకటేశ్వరరావు (వెంకన్నబాబు), గుబ్బల కోటేశ్వరరావును పొలం పంపి కట్టేత కట్టించడానికి పూనుకున్నాడు. ఉదయం పొలం వెళ్లిన లక్ష్మి వారిని చూసి నిలదీయగా.. మా మావయ్య పొలం నువ్వెవరు అడగడానికి అని ఎదురుతిరగడంతో బిత్తరపోయిన లక్ష్మి వారిని వారించే యత్నం చేయడంతో వారు ముగ్గురూ కలసి లక్ష్మిని చితకబాది వెళ్లిపోయారు.

గాయాలతో గ్రామంలోకి వచ్చిన లక్ష్మి సంఘ పెద్దలకు జరిగిన విషయం తెలిపింది. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి చికిత్స నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. కొంచెం తేరుకోవడంతో గురువారం ఇంటికి వచ్చి ఆందోళన చేపట్టింది. సంఘ పెద్దల సహకారంతో విలేకరులకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉండగా పొలం విషయంలో సంఘ పెద్దలు అడ్డు వస్తారని ముందుగానే ఊహించిన ఆంజనేయులు తొమ్మిది మంది పెద్దలు మామిడిశెట్టి పెద్దిరాజు, గుబ్బల జయరాజు, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి ఏసుబాబు, బండి చంద్రవాసు, దొంగ వెంకటరమణ, గుబ్బల సత్యనారాయణ, యల్లమిల్లి వెంకట రామలక్ష్మి, పిల్లి పద్మావతిలకు కోర్టు నుంచి నోటీసులు ఇచ్చాడు. దీనిపై సంఘ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement