‘మినీ కాసినో’ సూత్రధారి సంజయ్‌ అరెస్టు  | Sanjay arrested in 'Mini casino' issue | Sakshi
Sakshi News home page

‘మినీ కాసినో’ సూత్రధారి సంజయ్‌ అరెస్టు 

Oct 30 2017 3:19 AM | Updated on Aug 21 2018 6:00 PM

Sanjay arrested in 'Mini casino'  issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మారియట్‌లో (ఒకప్పటి వైశ్రాయ్‌ హోటల్‌) దీపావళి సందర్భంగా మినీ కాసినో నిర్వహించిన కేసులో సూత్రధారి సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఈ దందాలో ఇతడికి సహకరించిన పోలీసు టుడే మాస పత్రిక ఎడిటర్, ఎండీ వామనభట్ల శంకర్‌శర్మను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం గాంధీనగర్‌ ఠాణాలో అప్పగించారు. ఆదివారం ఉదయం ఇద్దరినీ గాంధీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సంజయ్‌ను రిమాండ్‌కు తరలించగా, శంకర్‌శర్మ స్టేషన్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు.  

పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయికి...  
సీతాఫల్‌మండి నామాలగుండుకి చెందిన సంజయ్‌కుమార్‌ అగర్వాల్‌ తొలుత నగరంలోని పేకాట క్లబ్బుల్లో దినసరి వేతనంపై పనిచేశారు. అప్పట్లో రోజుకు కేవలం రూ.200 జీతానికి పని చేసిన ఇతగాడు ఆ తర్వాత కొన్నాళ్లకు స్వయంగా పేకాట శిబిరాలు నిర్వహించడం ప్రారంభించాడు. నగరంలో క్లబ్బులు, పేకాట బంద్‌ అయిన తర్వాత తన సామాజిక వర్గంలో ఉన్న సంపన్నుల కోసం ప్రత్యేకంగా ‘టూర్లు’ ఏర్పాటు చేశాడు. గోవా, కేరళలకు పేకాట ప్రియుల్ని విమానాల్లో తీసుకువెళ్లి సకల విలాసాలతో పేకాట ఆడించి తీసుకురావడం చేస్తున్నాడు. గతంలో సిటీలో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు.  

రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. 
ఈ కాసినోపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ నెల 20 తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు ప్రవీణ్, బాబూలాల్, వీరి సహాయకులైన ఆరుగురితో పాటు 28 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. వీరి విచారణలోనే శంకర్‌శర్మ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న సంజయ్, శర్మల కోసం వేటాడిన టాస్క్‌ఫోర్స్‌ శనివారం రాత్రి పట్టుకుంది. మారియట్‌లోని ‘కాసినో’నుంచి పోలీసులు విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నారు.  

మారియట్‌ హోటలే అడ్డాగా.. 
దీపావళి నేపథ్యంలో తన అనుచరులైన రాజేశ్‌ జునేజా, రాజేందర్‌ నాగ్‌పాల్‌ సింగ్, చిక్కోటి ప్రవీణ్‌కుమార్, బాబూలాల్‌ అగర్వాల్‌లతో కలసి వ్యవస్థీకృతంగా పేకాట శిబిరం నిర్వహించడానికి మారియట్‌ హోటల్‌ను సంజయ్‌ ఎంచుకున్నాడు. ఈ నెల 17న అందులోని ఏడో అంతస్తులో ఓ సూట్‌తో పాటు రెండు రూమ్స్‌ బుక్‌ చేసుకున్నారు. బాగ్‌అంబర్‌పేటకు చెందిన శంకర్‌శర్మ ఈ శిబిరంలో 20 శాతం వాటా కలిగి ఉన్నాడు. ఎస్డీ సజీత్‌ అలీ, మహ్మద్‌ జఫార్, మహ్మద్‌ అమీర్, మహ్మద్‌ ఖాజా, రోహిత్‌ జోషి, కె.నగేష్‌లను సహాయకులుగా ఏర్పాటు చేసుకుని పరిచయస్తులైన పేకాటరాయుళ్లకు ఫోన్‌ ద్వారా ఈ ‘మినీ కాసినో’పై సమాచారం అందించారు. ఈ పేకాట శిబిరంలో ప్రవేశించడానికి రూ.2 లక్షలు చెల్లించాడు.

ఆ మొత్తం కట్టి ఆ విలువకు సరిపడా కాయిన్స్‌ తీసుకుని పేకాట ఆడటం ప్రారంభించారు. నగదు తీసుకురాని వారి కోసం సంజయ్‌ స్వైపింగ్‌ మిషన్లు కూడా ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికీ రసీదులు సైతం ఇస్తున్నాడు. సూత్రధారి సంజయ్‌కుమార్, ఇతడి సహాయకుడు బాబూలాల్‌ అగర్వాల్‌ పేర్లతో యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రెండు స్వైపింగ్‌ మిషన్లు తీసుకున్నారు. ఈ పంథాలో మూడు రోజుల్లో రూ. 80 లక్షలకు పైగా పేకాట సాగింది. సూత్రధారి సంజయ్‌ అగర్వాల్, శంకర్‌శర్మలు తమకు పెద్దలతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుని          ‘కాసినో’కు ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రణాళిక వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement