
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని రౌడీషీటర్ సయ్యద్ ఫరీద్ (26) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆరుగురు వ్యక్తు లు కత్తులు, కర్రలతో దాడి చేయడంతో పాటు బండ రాళ్లతో మోది హత్య చేశారు. ఈ ఘటన వివరాలను ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మాణికేశ్వరీ నగర్‌కు చెందిన సయ్యద్ ఫరీద్ ఆటో డ్రైవర్. ఇతనిపై చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ నమోదు అయింది. ఆదివారం ఉదయం రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఉండే ఓ వైన్‌షాప్ ముందు ఫరీద్ ఉండగా.. నలుగురు వ్యక్తులు, ఇద్దరు మహిళలు కత్తి, కర్రలతో దాడి చేశారు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన అతనిపై బండ రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఫరీద్ పై 17కు పైగా కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతనికి పైళ్లైంది కానీ ఆయన ప్రవర్తనతో విసు గు చెందిన భార్య వదిలిపెట్టి వెళ్లిపోయింది.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు?
ఫరీద్ హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రెజిమెంటల్ బజార్ పరికిబస్తీలో ఉండే నరసింహా అనే వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. అదే ప్రాంతంలో తిరుగుతున్న అతనితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.