కొన్ని గంటల్లోనే బిడ్డ పెళ్లి.. అంతలోనే... | Road Accident Woman Died Khammam | Sakshi
Sakshi News home page

కొన్ని గంటల్లోనే బిడ్డ పెళ్లి.. అంతలోనే...

Mar 1 2019 6:38 AM | Updated on Mar 1 2019 6:38 AM

Road Accident Woman Died Khammam - Sakshi

తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న (పెళ్లి) కూతురు

అశ్వాపురం: కొద్ది గంటల్లో కూతురు పెళ్లి. అంతలోనే ప్రమాదం జరిగింది. ఆ తల్లి.. అనంత లోకాలకు వెళ్లిపోయింది. అశ్వాపురంలోని బుడుగుబజారులో గురువారం ఇది జరిగింది. మండలంలోని చింతార్యాల క్రాస్‌ రోడ్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అశ్వాపురంలోని బుడుగుబజారుకు చెందిన కటుకూరి నాగేంద్రం(50) మృతిచెందింది. ఆమె కూతురు వివాహం, మండలంలోని మల్లెలమడుగు అబ్బాయితో మొండికుంటలోని ఫంక్షన్‌ హాల్‌లో గురువారం తెల్లవారుజామున పెళ్లి ముహూర్తం. పెళ్లి కూతురును తీసుకుని ఆమె తల్లి నాగేంద్ర, కుటుంబీకులు, బంధువులు వేర్వేరు వాహనాలలో అశ్వాపురం నుంచి మొండికుంటకు బయల్దేరారు.

మార్గమధ్యలోగల చింతిర్యాల క్రాస్‌ రోడ్‌ వద్ద నాగేంద్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. నాగేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వేరొక వాహనంలో ఉన్న పెళ్లి కూతురుకు, తన తల్లి మృతి వార్తను కుటుంబీకులు, బంధువులు తెలియనివ్వలేదు. అంతటి విషాదాన్ని దిగమింగుకుని వివాహం జరిపించారు. ఆ తరువాత కొద్ది గంటలకు ఆమెకు విషయం చెప్పారు. ఆమెతోపాటు కుటుంబీకులు, బంధువులు భోరున ఏడ్చారు. వివాహ వేడుక కళ తప్పింది. ఈ ప్రమాదంపై ఎస్సై మధు ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement