ఏసీబీ వలలో ‘రెవెన్యూ’ చేప

Revenue Officer Caught Bribery Demand In Kurnool - Sakshi

 ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు డబ్బు డిమాండ్‌

నందవరం ఆర్‌ఐ రామారావు నిర్వాకం

ఏసీబీ అధికారులను అశ్రయించిన బాధితుడు  

ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఎమ్మిగనూరురూరల్‌: ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వటానికి లంచం తీసుకుంటూ శుక్రవారం నందవరం ఆర్‌ఐ రామారావు  ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల వివరాల మేరకు..నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన బోయ రంగన్న తండ్రి లక్ష్మన్న చనిపోయాడు. తండ్రి పేరున ఉన్న ఆరెకరా పొలాన్ని తన తల్లి పేరున మార్చుకునేందుకు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కావాలని వినతిపత్రం పెట్టుకున్నాడు. ఆర్‌ఐ రామారావు సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రోజు కార్యాలయానికి తిప్పుకునేవాడు. చివరకు డబ్బు ఇస్తానని చెప్పటంతో ఆర్‌ఐ రూ. 4 వేలు డిమాండ్‌ చేశాడు. విసుగు చెందిన బోయ రంగన్న గురువారం ఏసీబీ అధికారులను కలసి విషయం చెప్పుకున్నాడు.

దీంతో ఏబీసీ అధికారులు నోట్లకు పౌడర్‌ అంటించి బాధితుడికి ఇచ్చి పంపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న ఆర్‌ఐకు రూ. 4 వేలు బాధితుడు ఇచ్చాడు. అప్పటికే అక్కడున్న మాటువేసిన ఏసీబీ అధికారులు నేరుగా వెళ్లి ఆర్‌ఐని పట్టుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జయరామరాజు మాట్లాడుతూ ఆర్‌ఐ రామారావు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌కు డబ్బు డిమాండ్‌ చేయటంతో బా«ధితుడు తమను సంప్రదించాడన్నారు. పక్కా ప్లాన్‌తో ఆర్‌ఐని పట్టుకున్నామని తెలిపారు. అధికారులు ఎవరైనా పనులు చేయటానికి డబ్బు డిమాండ్‌ చేస్తే తమ దృష్టికి తీసుకువస్తే వారి భరతం పడతామన్నారు. అవినీతి అధికారులపై సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. డీఎస్పీతో పాటు ఏసీబీ సీఐలు ఖాదర్‌బాషా, నాగభూషణం, సిబ్బంది ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top