11 మంది స్మగ్లర్లు అరెస్ట్‌ | Red Sanders Smuggling Arrest YSR Kadapa | Sakshi
Sakshi News home page

11 మంది స్మగ్లర్లు అరెస్ట్‌

Jul 13 2018 8:06 AM | Updated on Jul 13 2018 8:06 AM

Red Sanders Smuggling Arrest  YSR Kadapa - Sakshi

స్మగ్లర్ల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజ చిత్రంలో సీఐ రవిబాబు, ఎస్‌ఐలు

లక్కిరెడ్డిపల్లె: లక్కిరెడ్డిపల్లె సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చక్రాయపేట మండలాల పోలీసు స్టేషన్ల పరిధిలో 11మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి ,వారి వద్ద నుంచి 11 ఎర్రచందనం దుంగలు, ఒక టాటా సుమో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజ తెలిపారు. గురువారం లక్కిరెడ్డిపల్లె సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. లక్కిరెడ్డిపల్లె మండలం పాళెంగొల్లపల్లె అటవీ ప్రాంతంలో ఎస్‌ఐ సురేష్‌ రెడ్డి తన సిబ్బందితో కలిసి చేసిన దాడుల్లో 3 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, చక్రాయపేట ఇన్‌చార్జి ఎస్‌ఐ మంజునాథ తన సిబ్బందితో కలిసి చక్రాయపేట మండలం గొంది కడిశెల కోన అటవీ ప్రాంతంలో 3 దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. రామాపురం ఎస్‌ఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి శుద్ధమళ్ల అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టాటా సుమోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

11 ఎర్రచందనం దుంగల విలువ రూ.4 లక్షల 60 వేలు ఉంటుందని, టాటా సుమో విలువ రూ.3 లక్షల 60 వేలు ఉంటుందని తెలిపారు. అరెస్టయిన వారిలో 9 మంది తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కాగా ఒకరు సుమో ఓనరు,మరొకరు సుమో డ్రైవరుగా గుర్తించామన్నారు. మరో 5మంది పరారీలో ఉన్నారన్నారు. పరారీలో ఉన్న పీర్‌ మహ్మద్‌ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌తో పాటు తమిళనాడుకు చెందిన స్వామి, భాయ్, కర్నాటక బంగారు పేటకు చెందిన జావెద్, జబీ అనే వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ సమావేశంలో సీఐ రవిబాబు, ఎస్‌ఐలు సురేష్‌ రెడ్డి, మంజునాథ, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement