అయ్యో... పాపం!

Punjab Family Commits Suicide In Amberpet - Sakshi

భార్య మరణం తట్టుకోలేక భర్త మృతి

తల్లిదండ్రుల మరణం భరించలేక పిల్లల ఆత్మహత్యాయత్నం  

హైదరాబాద్‌ : భారాభర్తలు... ఒకరి మరణాన్ని ఒకరు తట్టుకోలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు విడిచారు. అమ్మానాన్నలేని ఈ లోకంలో ఉండబోమని కూతురు, కుమారుడు కూడా ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషాదకర సంఘటన గురువారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాలను కాచిగూడ ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ జె.రవీందర్‌ వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన పవన్‌ కర్బంధ(65), నీలం కర్బంధ(55) దంపతులు. వీరి సంతానం నిఖిల్‌ కర్బంధ(34), మన్ను కర్బంధ(30). ఈ కుటుంబం మూడేళ్ల నుంచి డీడీ కాలనీలో అద్దెకుంటోంది. పవన్‌ దంపతులు 1972లో నగరానికి వలస వచ్చారు. పవన్‌ సెవెన్‌ సీటర్స్‌ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాడు. అది పెద్దగా జీవనోపాధి ఇవ్వకపోవడంతో దానిని మానేసి ట్రూప్‌బజార్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు.

కుమారుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కూతురు ఇంట్లోనే ఉంటోంది. కొద్దికాలంగా నీలం కర్బంధ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. రెండు నెలలుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నగరంలోనే ఉంటున్న తన సోదరుడు హరిమోహన్‌కు పవన్‌ ఫోన్‌ చేసి సమాచారమిచ్చాడు. చిరునామా ఎక్కడో చెప్పాలని సోదరుడు అడుగగా తనకు తెలియదని, తాను పనిచేసే దుకాణంలో తెలుసుకోవాలని చెప్పాడు. మరునాడు ఉదయం దుకాణం వద్దకు హరిమోహన్‌ వెళ్లి అతికష్టం మీద వీరి చిరునామాను తెలుసుకొని డీడీ కాలనీకి వచ్చాడు. తలుపు తట్టినా ఇంట్లో నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు.
 
ఎవరు రాలేదనేమో.... 
పవన్‌ కర్బంధ కుటుంబం కొద్దికాలంగా బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉంటోంది. తన భార్య చనిపోయిందని చెప్పినా ఎవరూ రాలేదని పవన్‌ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య మృతి తట్టుకోలేక పవన్‌ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మానాన్న మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు నిఖిల్, కుమార్తె మన్ను బుధవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలుపుకొని తాగారు.  

తిరిగి సోదరుడు రావడంతో... 
బుధవారం మధ్యాహ్నం హరిమోహన్‌ వచ్చి వీరి ఇంటి తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా పవన్‌ కర్బంధ, నీలం కర్బంధ మృతి చెంది ఉన్నారు., నిఖిల్, మన్ను కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ ఆసుపత్రికి వీరిని తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. 48 గంటలు గడిస్తేగానీ వీరి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పవన్‌ కర్బంధ, నీలం కర్బంధల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

 
 ఆత్మహత్యకు పాల్పడింది ఈ భవనంలోనే..

అద్దె సక్రమంగానే ఇచ్చేవారు... 
ఇంటి అద్దెను సక్రమంగానే ఇచ్చేవారని పవన్‌ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని బ్రహ్మచారి తెలిపారు. తన తల్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, కాస్త ఫిజియోథెరపీ చేస్తే తిరిగి కోలుకుంటుందని మంగళవారం సాయంత్రం నిఖిల్‌ తమతో అన్నాడని ఆయన చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top