జగన్నాటకమే!

Prison Discharge From Sarvajana Hospital at Midnight - Sakshi

 రాత్రికి రాత్రి సర్వజనాస్పత్రి నుంచి ఖైదీ డిశ్చార్జ్‌  

కొన్ని నెలలుగా ప్రిజనర్స్‌ వార్డులో మకాం

విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు

అనంతపురం న్యూసిటీ: ఓ ఖైదీని కొన్ని నెలలుగా ఆస్పత్రిలో ఆశ్రయం కల్పించిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి రోగాలు, జబ్బులూ లేకున్నా.. ఓ రోగిగా రికార్డులు సృష్టించి ప్రిజనర్స్‌ వార్డులో రాజభోగాలు కల్పించిన వైనంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ను ఈ నెల 17న సాయంత్రం 5.20 గంటలకు ‘సాక్షి’ వివరణ కోరింది. ఈ విషయంపై ఆరా తీసిన ఆయన అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ పేర్కొన్నారు. అదే హడావుడితో గుట్టుచప్పుడు కాకుండా బుధవారం రాత్రికి రాత్రే ఏడు గంటలకు ఖైదీని డిశ్చార్జ్‌ చేసేశారు. సీసీ ఫుటేజీల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఆస్పత్రి రికార్డులో మాత్రం అదే రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు డిశ్చార్జ్‌ చేసినట్లు రాసేశారు. ఇదంతా చూస్తుంటే అంతా పథకం ప్రకారమే ఖైదీని ఆస్పత్రిలో ఉంచినట్లు తెలుస్తోంది. నిజంగా ఖైదీ ఆరోగ్య పరిస్థితి బాగా లేకుంటే ఆ సమయంలో ఎందుకు పంపాల్సి వచ్చిందంటూ ఆస్పత్రి వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

నిర్లక్ష్యం నీడలో జిల్లా యంత్రాంగం
‘ఆస్పత్రిపై ఆరోపణలు వస్తున్నా సీరియస్‌గా తీసుకోవడం లేదు. పేదలకు మెరుగైన సేవలందిస్తున్నారనే ఒకేఒక్క కారణంతో చిన్న వాటిని పట్టించుకోవడం లేదు’ అంటూ ఈ ఏడాది వైద్య కళాశాలలో జరిగిన హెచ్‌డీఎస్‌ సమావేశంలో వైద్యాధికారులను సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తుంటే.. సర్వజనాస్పత్రిలో అక్రమాలు జరుగుతున్న మాట వాస్తవమేనన్నది స్పష్టమవుతోంది. కేవలం హెచ్చరికలు తప్ప ఆచరణలో ఆ స్థాయి తీవ్రత కనిపించకపోవడంతో సర్వజనాస్పత్రిలో అక్రమార్కులకు మరింత ఊతమిచ్చినట్లైంది. దీంతో సర్వజనాస్పత్రిలో కీలక అధికారి ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే అతని అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆస్పత్రి వర్గాలే అంటున్నాయి.   

 ఆ ముగ్గురే కీలకం
కొన్ని నె లల పాటు ఆస్పత్రిలోని ప్రిజనర్స్‌ వార్డు లో ఖైదీని ఉంచడం వెనుక అ నంతపురం రెండో పట్టణ పోలీసు స్టే షన్‌లో విధులు నిర్వర్తించే ఓ హోంగార్డు, సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలోని ఓ వైద్యుడితో పాటు మ రో కీలక అధికారి ప్ర మేయం ఉన్నట్లు వి శ్వసనీయ సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా వీరు ముగ్గురు కలిసి ఖైదీకి సర్వజనాస్పత్రిలో ఆశ్రయం కల్పించా రు. వివిధ కారణాలు చూపుతూ రోజుల తరబడి ఖైదీ వార్డులో ఉండేలా సహకరిస్తూ వచ్చారు. ఇందుకు గాను వారికి రూ. లక్షల్లో నజరానాను ఆ ఖైదీ సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top