రవితేజ ఆసుపత్రిలో నిండు గర్భిణి మృతి | Pregnet Woman Died With Doctors Negligance In Guntur | Sakshi
Sakshi News home page

వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Jul 9 2018 12:53 PM | Updated on Sep 28 2018 3:39 PM

Pregnet Woman Died With Doctors Negligance In Guntur - Sakshi

మృతి చెందిన రాణి (ఇన్‌సెట్‌లో) ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మృతురాలి భర్త

మాచర్ల: వైద్యురాలి నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందిన ఘటన మాచర్ల పట్టణంలోని రామా టాకీస్‌కి వెళ్లే రహదారిలో రవితేజ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దుర్గి మండలం ఆత్మకూరుకు చెందిన పేరువాల రాణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త సాగర్, బంధువులు ఆమెను మాచర్లలోని రవితేజ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్‌ ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆపరేషన్‌ చేశారు. అయితే, రాణి ఆపరేషన్‌ కాగానే మృతి చెందింది. ఆసుపత్రి నిర్వాహకులు 10.30గంటల వరకూ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్లు వ్యవహరించారు. రక్తహీనత వల్ల తల్లి రాణి చనిపోయిందని, బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేదని తర్వాత చావు కబురు చల్లగా చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంపై రాణి భర్త, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికార పార్టీ నేతల రంగప్రవేశం
ఆ తరువాత ఆస్పత్రి నిర్వాహకులు అధికార పార్టీ నాయకులను పిలిపించుకొని మంతనాలు జరపడం మొదలుపెట్టారు. నష్టపరిహారం చెల్లిస్తామని నచ్చచెప్పబోయారు. ఈ సమయంలో కొంత మంది ఎస్సీ నాయకులు ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ప్రాణాలు పోయినా బేరాలు చేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అర్బన్‌ సీఐ సాంబశివరావు, పట్టణ ఎస్‌ఐ లక్ష్మయ్య సిబ్బందితో ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందలేదని, శాంతిభద్రతలు దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రికి వచ్చినట్లు చెప్పారు. ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబాన్ని బతిమాలుకుని కేసు పెట్టకుండా లక్ష రూపాయలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చేసేదేమి లేక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో బాధిత కుటుంబం నగదు తీసుకొని వెనుతిరిగి వెళ్లినట్లు సమాచారం.

గతంలోనూ పలు ఆరోపణలు
 ఇదే వైద్యురాలు గతంలో ప్రభుత్వాసుపత్రిలో ప్రసవించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ మహిళ మరణానికి కారణమై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై సెలవుపై వెళ్లిపోయింది. ఆమె పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తూ మరో మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement