వరకట్న వేధింపులకు గర్భిణి బలి

Pregnant victim for dowry harassment - Sakshi

పెళ్లైన మూడు నెలల నుంచే గొడవలు

మృతురాలి మెడపై గాయాలు

తమ కుమార్తెను హత్య చేశారని బాధితుల ఆరోపణ

పరారీలో అత్తింటివారు

చేవెళ్ల మండలం దేవునిఎర్రవల్లిలో ఘటన  

చేవెళ్ల : అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలైంది. పెళ్లైన మూడు నెలల నుంచే వరకట్న వేధింపులకు ఐదునెలల గర్భిణి తనువు చాలించింది. కడుపులోని పసిప్రాణం ఈ లోకాన్ని చూడకముందే కన్నుమూసింది. ఈ దుర్ఘటన చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో అత్తింటివారే కట్నం కోసం గొంతు నులిమి హత్యచేశారని మృతురాలి కుటుంబసభ్యుల  ఆరోపిస్తున్నారు.  

పోలీసుల వివరాల ప్రకారం..  

చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లి గ్రామానికి చెందిన పత్తి శ్రీశైలం, అంతమ్మల కుమారుడు పత్తి శ్రీనివాస్‌ అలియాస్‌ శేఖర్‌కు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంద్రానగర్‌కు చెందిన డిల్లెం మల్లేశ్, లక్ష్మీల ఒక్కగానొక్క కూతురు శిరీష (25) అలియాస్‌ మమతను ఇచ్చి 2017 జూన్‌ 16న వివాహం చేశారు. పెళ్లి సమయంలో 20 తులాల బంగారం, ఇతర సామగ్రితో మొత్తం రూ. 14 లక్షలు కట్నంగా ముట్టజెప్పారు.

మూడు నెలలపాటు సాఫీగా సాగిన వీరి కాపురం.. మూడవ నెల నుంచి శిరీష అత్తింటివారు అదనపు కట్నం వేధిస్తున్నారు. మరో రూ. 2 లక్షల కావాలని అత్త, మామ, భర్త, ఆడపడుచులు నిత్యం గొడవలు సృష్టిస్తున్నారు. దీంతో శిరీష గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. కుటుంసభ్యులు నచ్చజెప్పి గ్రామ పెద్దలతో మాట్లాడి మళ్లీ కాపురానికి  పంపించారు.

అప్పటి నుంచి తరుచూ కట్నం కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకు శిరీష మేనమామ శ్రీనివాస్‌కు భర్త శేఖర్‌ ఫోన్‌చేసి మీ కోడలు మాట్లాడటం లేదు ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పాడు. మరోగంటకు ఫోన్‌ చేసి చనిపోయిందని చెప్పడంతో వెంటనే కుటుంబసభ్యులంతా గ్రామానికి చేరుకున్నారు.  

మిన్నంటిన రోధనలు 

సోమవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి గొంతు భాగంలో గొంతు నులిమినట్లుగా గుర్తులు, మెడ మొత్తం గాయాలు ఉండడంతో అత్తింటివారు హత్య చేశారని నిలదీశారు. ఆదివారం రాత్రి కూడా  భర్త, అత్త, మామ శిరీషను వేధింపులకు గురి చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. రాత్రి 11.30 గంటలకు శిరీష వికారాబాద్‌లో ఉండే మేనమామ శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించడం.. ఫోన్‌ కలువకపోవడంతో తరువాత మెసేజ్‌ వచ్చిందని చెప్పారు.

అప్పుడే ఆమెను కొట్టి హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కగానొక్క కూతురును, ఆమె కడుపులో పెరుగుతున్న పసికందును కూడా హత్య చేశారని కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మృతురాలి బంధువుల ఆందోళన 

శిరీషను అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో వికారాబాద్‌ జిల్లా నుంచి బంధువులు దేవునిఎర్రవల్లికి వచ్చారు. తమ కూతురును ఎందుకు హత్యచేశారని  నిలదీస్తుండంగా భర్త, అత్తమామలు, ఆడపడుచులు అక్కడినుంచి తప్పించారు. దీంతో వారు వచ్చే వరకు  మృతదేహాన్ని తీసేది లేదంటూ ఆందోళనకు దిగారు. సీఐ గురువయ్య, ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డిలు, గ్రామపెద్దలు కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.  
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top