ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు: బీజేపీ 

Police Says Money Fight Behind West Bengal Triple Murder Case - Sakshi

కోల్‌కతా : స్కూల్‌ టీచర్‌ బంధు ప్రకాశ్‌ పాల్‌(35) కుటుంబం హత్య పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. ఆరెస్సెస్‌ కార్యకర్త అయినందుకు వల్లే బంధు కుటుంబం దారుణ హత్యకు గురైందని బీజేపీ ఆరోపిస్తుండగా... ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ నేరం జరిగిందని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కూలీ ఉత్పల్‌ బెహరాను అరెస్టు చేశామని.. అతడు నేరం అంగీకరించాడని వెల్లడించారు. బంధు నిర్వహిస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీంలో ఖాతాదారుడైన ఉత్పల్‌... తన డబ్బులు తనకు ఇచ్చేందుకు నిరాకరించడంతోనే బంధు కుటుంబాన్ని హతమార్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.06 నుంచి 12.11 ప్రాంతంలో ఈ దారుణం జరిగిందని.. ఆ సమయంలో బంధు ఇంటి నుంచి ఉత్పల్‌ బయటికి రావడం తాను చూసినట్లు పాలు అమ్ముకునే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు.

అంతేగాక ఉత్పల్‌ ఫోన్‌కాల్‌ లిస్టు, ఘటనాస్థలంలో దొరికిన ఆయుధంపై అతడి వేలిముద్రలు దొరికాయని పోలీసులు వెల్లడించారు. దీంతో ఉత్పల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని పేర్కొన్నారు. తొలుత బంధును మాత్రమే చంపాలనుకున్నానని.. అయితే ఆ సమయంలో అతడి భార్యా పిల్లలు తనని చూస్తే పోలీసులకు చెబుతారనే భయంతోనే వారిని కూడా హత్య చేసినట్లు ఉత్పల్‌ విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.(చదవండి : అందుకే ఆ ముగ్గురినీ చంపేశాడు!)

ఈ నేపథ్యంలో తమ కుమారుడు అలాంటి వాడు కాదని.. పోలీసులే తనను కేసులో ఇరికించారని ఉత్పల్‌ తండ్రి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధ పడుతున్నారని... తమకు ఉత్పల్‌ సంపాదన తప్ప ఇతర జీవనాధారం లేదని అతడి సోదరి వాపోయింది. నిజమైన హంతకులను పట్టుకుని తన సోదరుడిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసింది. కాగా ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ స్పందించారు. మమత సర్కారు అభాసుపాలుకాకుండా పోలీసులు ఓ కట్టుకథ అల్లారని ఆరోపించారు. ‘కేవలం రూ. 48 వేల కోసం ఓ వ్యక్తి కుటుంబం మొత్తాన్ని అంతమొందించాడన్నది నేటి కథ. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు పోలీసులు కంటితుడుపు చర్యగా ఓ రోజూవారీ కూలీని అరెస్టు చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వ సంస్థచేత విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. కేవలం 5 నిమిషాల్లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి.. వెంటనే అక్కడి నుంచి పారిపోవడం సాధ్యమయ్యే విషయమేనా అని ప్రశ్నించారు.

కాగా ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. పలువురు బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఈ హత్యల వెనుక ఎటువంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మమత ప్రభుత్వం, బీజేపీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(చదవండి : తల్లిదండ్రులు, చిన్నారి పాశవిక హత్య)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top