రేవ్‌ పార్టీ సూత్రధారి టీడీపీ నేత కొడుకు

Police Negligence in Visakhapatnam Rave Party - Sakshi

విశాఖ నగరంలో రంకెలేసిన రేవ్‌ పార్టీ  సూత్రధారులను వదిలేసిన పోలీసులు.. ప్రస్తుతానికి పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన నిందితులను మాత్రమే అరెస్టు చేసే పనిలో ఉన్నారు.విశాఖ నగర ప్రతిష్టను మంటగలిపే విధంగా జరిగిన డ్రగ్స్‌ పార్టీకి.. మందు పార్టీ పేరిట అనుమతులు తీసుకున్న టీడీపీ నేత బొడ్డేటి కాశీవిశ్వనాథ్‌ కొడుకు నరేంద్రకుమార్‌ జోలికి పోని ఖాకీలు.. డ్రగ్స్‌ పంపిణీ చేసిన బ్యాచ్‌ను మాత్రం జల్లెడపడుతున్నారు. సదరు రేవ్‌ పార్టీకి ఇద్దరు మంత్రుల కుమారులు, ఓ మాజీ మంత్రి కుమారుడు, నగరానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కొడుకు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. అసలు వీరి కోసమే అట్టహాసంగా ఆ పార్టీ పెట్టారనేది అందరికీ తెలిసిన వాస్తవం.కానీ ఈ కోణం వైపు కన్నెత్తి చూడని పోలీసులు డ్రగ్స్‌ మాఫియా పని పడతామంటూ బీరాలు పోతున్నారు.మరోవైపు వెనుకా ముందూ ఆలోచించకుండా రేవ్‌ పార్టీకి అడ్డగోలు అనుమతిలిచ్చేసిన ఎక్సైజ్‌ అధికారులు ఒక్కొక్కరుగా బలవుతున్నారు. సెలవు రోజైన ఈనెల 13న అర్ధంతరంగా మందు పార్టీకి అనుమతిలిచ్చిన గాజువాక ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  బి.సుబ్బారావు బుధవారం నుంచి దీర్ఘకాల సెలవులోకి వెళ్లిపోగా ఆ బాధ్యతను మరో అధికారి దాస్‌కు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇంకా ఎవరిపై వేటు పడనుందనే భయం ఆ వర్గాలను వెంటాడుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ నాయకుడు బొడ్డేటి కాశీవిశ్వనాథ్‌ కొడుకు బొడ్డేటి నరేంద్రకుమార్‌ ఈనెల 13న శనివారం పెందుర్తి ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదే రోజు రాత్రి రిషికొండలోని విశ్వనాథ్‌ బీచ్‌ ఫ్రంట్‌ పేరుతో తాను నిర్వహిస్తున్న క్లబ్‌లో మందు పార్టీకి అనుమతి కావాలని అడిగారట. వెంటనే పెందుర్తి ఎక్సైజ్‌ పోలీసులు గాజువాక ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బి.సుబ్బారావుకు సిఫార్సు చేయగా.. ఆయన క్షణాల్లో అనుమతులిచ్చేశారట.

ఇక్కడే ఎక్సైజ్‌ అధికారుల తప్పిదం, నిర్లక్ష్యం, ఒత్తిళ్లకు తలొగ్గిన బలహీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ రోజు రెండో శనివారం. సెలవురోజు. ఎంత ఆన్‌లైన్‌లో చలానా కట్టేసి దరఖాస్తు చేసుకున్నా.. అసలు అది పుట్టినరోజు పార్టీనా.. ఉత్సవమా... పండుగా..లేక మరేదైనా సందర్భంగా చేసుకుంటున్న పార్టీనా అనేది ఆరా తీసిన తర్వాతే అనుమతులివ్వాలి. పార్టీ కూడా నిబంధనల మేరకు రాత్రి 11గంటల్లోగా పూర్తి చేయాలని నిర్దేశించాలి. కానీ సదరు ఎక్సైజ్‌ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా టీడీపీ నేత కుమారుడు కాబట్టి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి పారేశారు.  ఇంకేముంది.. ఆ రోజు రాత్రి తెల్లవార్తూ రేవ్‌ పార్టీ జడలు విప్పింది. మందు పార్టీ పేరిట తీసుకున్న అనుమతులను కాలరాసి కొకైన్, ఎండీఎం ఫౌడర్, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా వినియోగించారు. ఈ బాగోతం మీడియా ద్వారా బయటపడటంతో పోలీసులు తమదైన శైలిలో హడావుడి మొదలుపెట్టారు.  డ్రగ్స్‌ సరఫరా చేసిన వారి పని పట్టారు. కానీ అసలు సూత్రధారుల జోలికి మాత్రం వెళ్ళలేదు. వెళ్ళే సాహసం కూడా చేసే పరిస్థితి కనిపించడం లేదు.

పార్టీ నిర్వాహకుడు నరేంద్ర జోలికి పోని ఖాకీలు
బొడ్డేడ కాశీవిశ్వనాథ్‌ పేరు చెబితేనే ఓ మంత్రి గుర్తుకు వస్తారు. అలాంటి విశ్వనాథ్‌ కొడుకు నరేంద్రకుమార్‌ స్వయంగా పార్టీకి అనుమతులు తీసుకొని నిర్వహించిన పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ వినియోగంపై పోలీసులు ముందుగా అతన్నే ప్రశ్నించాల్సి ఉంది. కానీ నగర పోలీసులు మాత్రం ఇప్పటివరకు అతనిపై కేసు కాదు కదా.. కనీసం విచారించనూ లేదు. ఇందుకు పోలీసులు చెబుతున్న వాదన ఏమిటంటే.. పార్టీకి అతను అనుమతులు తీసుకున్న మాట నిజమే కానీ.. మాదకద్రవ్యాలతో అతనికి ఏమాత్రం సంబంధం లేదట!  ఇక్కడే పోలీసుల విచారణ ఎంత సవ్యంగా సాగుతుందో స్పష్టమవుతుంది. పార్టీ నిర్వహించిన నరేంద్రకు తెలియకుండానే మాదకద్రవ్యాలు ఆ పార్టీకి ఎలా వస్తాయి.. అక్కడికి వచ్చిన వారు ఎలా వినియోగిస్తారన్న ప్రశ్నలకు పోలీసుల వద్ద సరైన సమాధానమే లేదు. ఈ వ్యవహారంలో ముందుగా అతనే బాధ్యుడు.. అనే కనీస స్పృహ కూడా పోలీసులు పక్కనపెట్టి విచారణ చేస్తున్నారంటే కేసులో ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. ఇకపోతే ఆ పార్టీకి ఇద్దరు మంత్రుల కుమారులు, ఓ మాజీ మంత్రి కుమారుడు, ఎమ్మెల్యే కుమారుడు హాజరైన విషయమై సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఏమీ తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

ఆధారాలు దొరికితే నరేంద్రనూ వదలం: సీపీ లడ్హా
కేసును నిష్పక్షపాతంగా విచారిస్తున్నాం. ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. టీడీపీ నేత కాశీవిశ్వనాథ్‌ కుమారుడు నరేంద్ర పాత్రపై కూడా విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆ పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన వారిని అరెస్టు చేశాం. మరికొందరు మా అదుపులో ఉన్నారు. నరేంద్రకు తెలిసే డ్రగ్స్‌ సరఫరా జరిగిందని తెలిస్తే అతనిపై కూడా చర్యలు తీసుకుంటాం. ఇందులో అనుమానం లేదు.
పోలీసు అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి.

ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు
విశాఖలో విష సంస్కృతికి బీజం వేసిన రేవ్‌ పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు డిమాండ్‌ చేశారు. రిషికొండలో జరిగిన పార్టీలో పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్టు చేయాలన్నారు.  ముందుగా నిర్వాహకుల లైసెన్స్‌లు రద్దు చేయాలని కోరారు. పోలీసులు ఒత్తిళ్ళకు తలొగ్గకుండా నిష్పపక్షపాతంగా విచారణ చేపట్టాలని, దోషులు ఎంతటి వారైనా వదలొద్దని విజ్ఞప్తి చేశారు.

నరేంద్ర మావద్దకు వచ్చి అడిగారు
పెందుర్తి ఎక్సైజ్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌నాయుడుఈ నెల 13న  బి.నరేంద్రకుమార్‌ అనే వ్యక్తి పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఈవెంట్‌ నిర్వహించుకుంటామని అంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. గెస్ట్‌లకు లిక్కర్‌ సరఫరా చేస్తామని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా చలానా కట్టారు. ఇటీవల సడలించిన నిబంధనల ప్రకారం చలానా చెల్లిస్తే సెలవు రోజుల్లో కూడా పార్టీలకు అనుమతి ఇవ్వవచ్చు. ఆ ప్రకారమే శనివారం అయినా కూడా మా శాఖ ద్వారా అనుమతి ఇచ్చామని పెందుర్తి ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌నాయుడు చెప్పుకొచ్చారు.

పోలీసుల అదుపులో సోను?
ఆ పార్టీకి మాదకద్రవ్యాలు సరఫరా చేసిన మల్లిపెద్ది సాయిరాఘవ చౌదరి అలియాస్‌ సోను ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. సోను ద్వారానే నగరంలోని చాలామందికి డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మేరకు అతన్ని రహస్య వ్రదేశంలో విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.

సుబ్బారావు సెలవులో ఉన్నారు
నోడల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దాస్‌ కారణాలు నాకు తెలియదు.. గాజువాక ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారావు సెలవుపై వెళ్ళారు.. అతని సెల్‌ ఫోన్‌ కూడా నావద్దనే ఉంది.. అని విశాఖ నోడల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దాస్‌ సాక్షి ప్రతినిధికి చెప్పుకొచ్చారు.

లీవులో వెళ్లిన ఎక్సైజ్‌ ఈఎస్‌  
కాగా, రేవ్‌ పార్టీకి వెనుకా ముందు ఆలోచించకుండా అడ్డగోలుగా అనుమతిలిచ్చేసిన ఎక్సైజ్‌ పోలీసులు బలవుతున్నారు. గాజువాక ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సుబ్బారావును బుధవారం అమరావతి పిలిపించుకున్న ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవు పెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీంతో ఆయన తన సెల్‌ఫోన్‌ కూడా మరో అధికారికి అప్పగించేసి లీవు పెట్టేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top