మిమిక్రీతో క్రిమినల్‌ను హడలెత్తించిన పోలీసు..!

Police Mimic Gun Sounds To Scare Criminal When Pistol Jammed In Uttar Pradesh - Sakshi

లక్నో : ఓ పోలీసు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కరుడుగట్టిన నేరస్తుడు పట్టుబడ్డాడు. పిస్తోల్‌ జామ్‌ కావడంతో ఏం చేయాలో తోచని కానిస్టేబుల్‌ మిమిక్రీతో బుల్లెట్లు దూసుకెళ్లున్న శబ్దం చేశాడు. నేరస్తున్ని పారిపోకుండా బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..18 క్రిమినల్‌ కేసుల్లో నిందితునిగా ఉన్న రుక్సార్‌ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, ఇటీవల రుక్సార్‌ జాడ తెలుసుకున్న పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అంతలోనే ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్‌ కూడా మొదలైంది. ఇంతలోనే ఓవైపున్న పోలీసు ఇన్స్‌పెక్టర్‌ తుపాకీ జామ్‌ అయింది. (కారు ఆపనందుకు కాల్చేశారు)

అయితే, విషయం బయటకు తెలిస్తే క్రిమినల్‌ తమపై కాల్పులు జరిపి పారిపోతాడని గ్రహించిన ఓ కానిస్టేబుల్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. ఇన్‌స్పెక్టర్‌ పక్కన నిల్చుని బుల్లెట్లు గాల్లోకి దూసుకెళ్లినట్టు మిమిక్రీ చేశాడు. అంతలోనే స్పందించిన మిగతా పోలీసులు పారిపోయే ప్రయత్నం చేసిన రుక్సార్‌ కాలికి గురిపెట్టి కాల్చారు. క్రిమినల్‌ను అరెస్టు చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. కాగా, రుక్సార్‌ తలపై 25 వేల రివార్డు ఉంది. ఇదిలా ఉండగా.. రెండు వారాల క్రితం కారు ఆపలేదని ఆపిల్‌ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగిని లక్నోలోని గోమతినగర్‌లో పోలీసులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. (తివారి హత్య; కానిస్టేబుల్‌ భార్యకు భారీ విరాళం!)

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top