మహారాష్ట్ర గ్యాంగ్‌ వేటలో పోలీసులు | Police in the hunt for the Maharashtra gang | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర గ్యాంగ్‌ వేటలో పోలీసులు

Feb 12 2019 3:21 AM | Updated on Feb 12 2019 3:21 AM

Police in the hunt for the Maharashtra gang - Sakshi

పులి చనిపోయిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీ సత్యనారాయణ (ఫైల్‌)

సాక్షి,పెద్దపల్లి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ (పెద్దపులి) మృతి, అనంతర దందాపై పోలీస్‌ విచారణ తుది దశకు చేరుకుంటోంది. పులి మృతి, అక్రమ దందాలపై ‘సాక్షి’లో వరుస కథనాలకు స్పందించిన ప్రభుత్వం.. కేసును అటవీశాఖ నుంచి రామగుండం పోలీసు కమిషనరేట్‌కు బదిలీ చేసింది. కమిషనర్‌ సత్యనారాయణ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులు పెట్టిన విద్యుత్‌ తీగలకు తగిలి పెద్దపులి మృతి చెందడం.. ఆ తరువాత చర్మం, గోళ్లతో వ్యాపారం చేసే ప్రయత్నం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పులి వేట నిరో ధక సంస్థ పేరుతో ఏర్పాటు చేసిన ఓ స్వచ్ఛంద సంస్థనే ఈ ‘ఆపరేషన్‌ టైగర్‌ స్కిన్‌’కు సూత్రధారి అని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థ పేరిట సంవత్సరాలుగా నిందితులు సాగిస్తున్న అక్రమ దందాల సమాచారం పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.  

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం శివ్వారం గ్రామ సమీపంలోని అడవుల్లో జనవరిలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ మృతి వెలుగు చూసింది. రైతులు పెట్టిన విద్యుత్‌ తీగలకు తగిలి ఈ పులి మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంబంధిత రైతులను అరెస్ట్‌ కూడా చేశారు. పులి మృతి చెందిన తరువాతే అసలు కథ మొదలు కాగా, ఆ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగారు. పులి వేట నిరోధక సంస్థ పేరుతో అటవీ అధికారులను బురిడీ కొట్టించిన గ్యాంగ్‌ కోసం పోలీసుల విచారణ  పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాయే కాకుండా ఐదారు రాష్ట్రాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తెలిసింది.

అటవీశాఖ అధికారులతో సబంధాలు పెంచుకునేందుకు, అక్రమ దందాపై అనుమానం రాకుండే ఉండేందుకే పులుల వేట నిరోధక సంస్థ ముసుగు వేసుకున్నట్లు  దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు సమాచారం. వన్యప్రాణుల చర్మాలు, విలువైన కొమ్ము లు, పులిగోళ్లు లాంటివి కొనుగోలు చేస్తామని చెప్పి అటవీ సమీప ప్రాంతాల్లో తిరు గుతూ.. ఒకవేళ బేరం గిట్టకపోతే అటవీశాఖ, పోలీసులకు పట్టిస్తూ రెండు పాత్రలు పోషిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌  రాష్ట్రాల్లో టైగర్‌ హంటింగ్‌ ఎండ్‌ కార్యకలాపాలు విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు.  

రెండేళ్ల క్రితమే రిజిస్ట్రేషన్‌ 
టైగర్‌ హంటింగ్‌ ఎండ్‌ సంస్థ రెండేళ్ల క్రితమే రిజిస్ట్రేన్‌ చేయించుకున్నట్లు తెలిసింది. కానీ, దాదాపు 12 ఏళ్లుగా ఈ గ్యాంగ్‌ ఇదే పనిలో నిమగ్నమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మహారాష్ట్రలో ఉంటున్న గ్యాంగ్‌పై పోలీసులు ఉచ్చు బిగించినట్లు సమాచారం. అయితే ఈ సంస్థ పులుల వేటను నిరోధిస్తుందా, ఆ ముసుగులో వన్యప్రాణుల మరణాలను ప్రోత్సహిస్తోందా..అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయిన వన్యప్రాణుల విలువైన చర్మాలను కొనుగోలు నెపంతో రూ.లక్షలు వసూలు చేసుకుని పరారైనట్లుగా మొన్నటి సంఘటనతో పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement