24 గంటల్లో కిడ్నాపర్ల ఖేల్‌ ఖతం!

Police detained kidnappers and guard the boy - Sakshi

     కిడ్నాపర్లను గుర్తించి బాలుడిని కాపాడిన పోలీసులు 

     మరో ఇద్దరు చిన్నారులకూ విముక్తి 

     బస్సు డ్రైవర్‌ సమాచారమే కీలకంగా మారిన వైనం 

హైదరాబాద్‌: బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో సోమవారం ఉదయం బాలుడి కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. కేసు వివరాలను నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి, రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనౌజ్‌ జిల్లా మన్నాపూర్‌ ప్రాంతానికి చెందిన సంజూ చామర్‌(32) కుమారుడు ఆయూష్‌(4), కుమార్తె అంజలి(7)తో కలసి నగరంలోని బండ్లగూడలో నివసిస్తోంది. జీవనోపాధి లేకపోవడంతో సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు తన పిల్లలతో కలసి వచ్చింది. తర్వాత టిఫిన్‌ కోసమని తల్లి బయటకు వెళ్లగా బాలుడిని ఇద్దరు మహిళలు కిడ్నాప్‌ చేశారు. గోపాలపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కిడ్నాపర్‌లు ఉదయం 7.36 నిమిషాలకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఫుటేజీల ఆధారంగా వెనక్కివెళ్లి వారి ఆచూకీ కోసం గాలించసాగారు.  

‘చిల్లర’గొడవే పట్టించింది... 
సుచిత్ర జంక్షన్‌ వద్ద హకీంపేట డిపోకు చెం దిన 25ఎస్‌ బస్సులో సోమవారం ఉదయం ఇద్దరు మహిళలు ఎక్కారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకుగాను టికెట్‌కు అవసరమైన చిల్లర డబ్బులు లేకపోవడంతో గొడవ పడ్డారు. డ్రైవర్‌ నర్సింహులు కల్పించుకుని టికెట్‌ రేటు రూ.30 చెల్లించి మిగతా చిల్లర తర్వాత తీసుకోవాలని సూచించారు. ‘మా అంబేడ్కర్‌ నగర్‌ నుంచి స్టేషన్‌కు 10 రూపాయలే కదా!’అని డ్రైవర్‌తోనూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమం లో పోలీసులు సదరు మహిళల ఫొటోలను చూపడంతో డ్రైవర్‌ గుర్తుపట్టి గొడవ వివరాలు వెల్లడించారు. ఆ మహిళలు అల్వాల్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వారై ఉంటారని పోలీసులు భావించి మంగళవారం వేకువజాము వరకు ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. స్థానికుల సమాచారం మేరకు సమీపంలోని జొన్నలగడ్డలో కిడ్నాపర్‌ల ఇంటిని గుర్తించి బాలుడిని కాపాడారు. సురక్షితంగా తల్లికి అప్పగించారు. 

కిడ్నాపర్ల చెరలో మరో ఇద్దరు 
బాలుడిని కిడ్నాప్‌ చేసిన నిందితురాళ్లు యాదమ్మ (21), ఎం.జయ(18)ల అదుపులో మరో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు కనుగొన్నారు. తమ పిల్లలే అని తొలుత బుకాయించగా గట్టిగా నిలదీయడంతో వారిని సైతం కిడ్నాప్‌ చేసి తీసుకొచ్చినట్లు నిందితులు అంగీకరించారు. వీరిలో శేఖర్‌ అనే ఏడేళ్ల బాలుడిని 2015లో ఉందానగర్, రేణుక (7) అనే బాలికను మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి అపహరించినట్లు చెప్పారు. శేఖర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పుగూడకు చెందిన అంజయ్య కుమారుడని, రేణుక నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ప్రాంతానికి చెందిందని పోలీసులు గుర్తించారు. 

ప్రజల సహకారమే కీలకం: డీసీపీ సుమతి
పలు కేసుల ఛేదనలో పోలీసులకు స్థానికులు ఇచ్చే సమాచారమే కీలకంగా మారుతుందని డీసీపీ సుమతి అన్నారు. ఆయూష్‌ కిడ్నాప్‌ కేసు దర్యాప్తులో బస్సు డ్రైవర్, అంబేడ్కర్‌నగర్‌వాసులు ఇచ్చిన సమాచారం ఉపయోగపడిందన్నారు. పౌరులు తమకు అనుమానం వచ్చిన విషయాలను వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top