చోరీ కేసుల్లో అంతర్‌ రాష్ట్ర దొంగలు అరెస్టు

Police ArrestThree Thiefs In Prakasam - Sakshi

సాక్షి, చీరాల (ప్రకాశం): తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి అర్ధరాత్రి సమయంలో చోరీలకు పాల్పడిన కేసుల్లో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను చీరాల పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మంగళవారం ఇక్కడి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు నిందితుల వివరాలు వెల్లడించారు. ‘చీరాల ఐఎల్‌టీడీ కంపెనీ సమీపంలోని శాంతినగర్‌కు చెందిన అల్లు సంజయ్‌ కుమార్, అతని తల్లి సలోమి, ఆమె అల్లుడు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గుమల్లివారిపాలేనికి చెందిన గుర్రాల దయారాజు ఒక జట్టుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతుంటారు.అల్లు సంజయ్‌ది దొంగతనాల్లో అందెవేసిన చేయి. ఇతనిపై తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ, తెనాలి, బాపట్ల, చీరాల ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 32 దొంగతనాలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సంజయ్‌ అన్న సన్నీ కూడా హైదరాబాద్‌లో పలు చోరీలు చేసి పట్టుబడి చెర్లపల్లి సెంట్రల్‌ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం పట్టుబడిన నిందితులు చీరాల ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు, టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు చోరీలకు పాల్ప డ్డారు. అల్లు సంజయ్‌ చోరీ చేసిన బంగారం, ఇతర వస్తువులను అతని తల్లి సలోమికి, ఆమె అల్లుడు బాపట్లకు చెందిన గుర్రాల దయారాజుకు ఇస్తుంటాడు. ఆ వస్తువులను వీరిరువురూ వివిధ దుకాణాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అతనంతరం అందరూ కలిసి వాటాలు పంచుకుని జల్సాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చీరాల టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కొత్తపేట పంచాయతీ గోపాలపురానికి చెందిన రాపూడి రజని ఇంట్లో అర్ధరాత్రి సమయంలో టీవీ, హోమ్‌ థియేటర్, మరికొన్ని వస్తువులు అపహరించారు.

అలాగే ఈ నెల 10వ తేదీన చీరాల పెద్దరథం సెంటర్‌ సమీపంలోని డక్కుమళ్ల అనిత అనే మహిళ ఇంట్లో చొరబడి వెండి వస్తువులతో పాటు కొంత నగదు, సెల్‌ఫోన్లు, రిస్ట్‌వాచీలు అపహరించారు. ఒన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హరిప్రసాద్‌ నగర్‌కు చెందిన మచ్చా అంకయ్య ఇంట్లో రూ.2 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు చోరీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెస్తపాలేనికి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ తుపాకుల రఘనాథబాబు ఇంట్లో 49 ఇంచెస్‌ ఎల్‌జీ ప్లాస్మా టీవీని కొట్టేశారు. 

ఈ చోరీలపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన ఒన్‌టౌన్, టూటౌన్‌ పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.75 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, టీవీలు, సెల్‌ఫోన్లు, రిస్ట్‌వాచీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాడుతున్న సెల్‌ఫోన్ల ఆధారంగా కేసులను ఛేదించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన టూటౌన్‌ ఎస్సై నాగేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top