రెచ్చిపోయిన గంగూ ఆనంద్‌ 

Person Attacked With Knife On Two people Because Of Asking Money In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి..బాధితులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరు గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాలలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు..  నంద్యాల సీఎస్‌ఐ చర్చిలో గతంలో సెక్రటరీగా పనిచేసిన  పట్టణానికే చెందిన గంగూ ఆనంద్‌ చర్చికి సంబంధించిన సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏడాది కిందట 300 మంది నిరుద్యోగుల వద్ద దాదాపు రూ.7 కోట్లు దండుకున్నాడు.

బాధితుల్లో అధికంగా జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, తిరుపతి, మైలవరం ప్రాంతాల వారు ఉన్నారు. బాధితులు న్యాయం కోసం దాదాపు నాలుగు నెలల కిందట గంగూ ఆనంద్‌ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఆనంద్‌పై టూటౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదు కావటంతో సెక్రటరీ పదవి నుంచి తప్పించారు.  అలాగే కొంత కాలంగా బాధితులు పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించలేదు. గంగూ ఆనంద్‌ టీడీపీ ప్రధాన నాయకులకు ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు.

వారి అండదండలతోనే గత ఏడాది నిరుద్యోగులను మోసం చేసి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  కాగా.. సోమవారం మధ్యాహ్నం  దాదాపు 32 మంది బాధితులు గంగూ ఆనంద్‌ ఇంటి వద్దకు వెళ్లి డబ్బులను తిరిగి ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో వైఎస్సార్‌ జిల్లాకు చెందిన సోమశేఖర్‌రెడ్డి, సురేంద్రనాయుడు అనే బాధితులు ఆనంద్‌ను ఇంట్లో నుంచి బయటికి రావాలని కేకలు వేశారు. దీంతో అతను ఆవేశంతో కత్తి తీసుకొచ్చి ఇంటి వద్ద నుంచి వెళ్లిపోవాలని, లేకుంటే అందరినీ ఇక్కడే పొడిచి చంపేస్తానని బెదిరించాడు.  

తమ డబ్బు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి వెళతామని బాధితులు భీష్మించారు. సహనం కోల్పోయిన ఆనంద్‌ కత్తితో దాడికి తెగబడ్డాడు. సోమశేఖర్‌రెడ్డి పొట్ట భాగంలో పొడవడంతో తీవ్ర గాయమైంది. అలాగే సురేంద్రనాయుడు చేతికి స్వల్ప గాయమైంది. అడ్డుకోబోయిన మరికొంత మంది బాధితులపైనా దాడికి దిగాడు. బాధితులు భయంతో పరుగులు తీసినా గంగూ ఆనంద్‌ వదలకుండా వెంటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సోమశేఖర్‌రెడ్డిని తోటి బాధితులంతా కలిసి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టూటౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి బాధితులను పరామర్శించి..  సంఘటన గురించి వివరాలు సేకరించారు.  బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న గంగూ ఆనంద్‌కోసం గాలింపు మొదలుపెట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top