దొరికిపోతామనే భయంతో ఢీ కొట్టారు

Three People Attacked On Police Officer At Vikarabad District - Sakshi

గంజాయితో దొరికిపోతామని కారుతో ఎస్‌ఐని ఢీ కొట్టిన యువకులు

కాలు విరిగిపోవడంతో పాటు ఎస్‌ఐకు తీవ్రగాయాలు

తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు యువకులు

వికారాబాద్‌: కారులో గంజాయి..ఎదురుగా పోలీసుల తనిఖీలు..తప్పించుకునేందుకు లైట్లు ఆపి కారు ముందుకు పోనిచ్చారు అందులోని యువకులు. గంజాయితో పట్టుబడిపోతామన్న భయంతో కారును ముందుకు పోనిచ్చి ఆ ముగ్గురు యువకులు ఎస్‌ఐని ఢీకొట్టేశారు. దీంతో ఆయన కాలు విరిగిపోయింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో సన్నివేశాన్ని తలపించేలా ఉన్న ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాల్దో బుధవారం అర్థరాత్రి దాటాక జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌ సబ్‌ డివిజన్‌లోని నవాబ్‌ పేట ఎస్‌ఐగా పనిచేస్తున్న కృష్ణ బుధవారం రాత్రి అనంతగిరి గుట్ట ఘాట్‌రోడ్‌లోని నంది విగ్రహం వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. టోలిచౌకీ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్‌లు నగరంలోని ఓ పెడ్లర్‌ వద్ద గంజాయిని కొన్నారు.

అనంతరం అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కారును అద్దెకు తీసుకుని కోట్‌పల్లి ప్రాజెక్టుకు బయల్దేరారు. ఈ క్రమంలో అనంతగిరి గుట్ట పైకి చేరుకున్నారు. అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి తనిఖీల్లో గంజాయితో పట్టుబడిపోతామని భయపడి వెంటనే లైట్లు ఆపి నందిగుట్ట పక్కనే కారుని నిలిపివేశారు. దీన్ని గమనించిన కృష్ణ వారి కారువద్దకు వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో యువకులు లైట్లు ఆన్‌ చేయకుండానే కారును స్టార్ట్‌ చేసి వేగంగా ముందుకు పోనిచ్చారు.

ఈ క్రమంలో వారు ఎస్‌ఐ కృష్ణను ఢీ కొట్టారు. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఫెన్సింగ్‌కు ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎస్‌ఐ కాలు విరిగిపోవడంతోపాటు కంటినొసలకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు యువకుల్ని అరెస్టు చేశారు. వారివద్దనుంచి సుమారు 150–200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ ఎస్‌ఐను వికారాబాద్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా మరింత మెరుగైన చికిత్స కోసం నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు జిల్లా ఎస్పీ నారాయణ గురువారం మీడియాకు తెలిపారు.  

ఎస్‌ఐను ప్రశంసిస్తూ డీజీపీ ట్వీట్‌ 
ఈ ఘటనలో గాయపడ్డ ఎస్‌ఐ కృష్ణ ఆరోగ్యం గురించి డీజీపీ మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ‘కొత్త సంవత్సర వేడుకల్లో బందోబస్తులో ప్రమాదానికి గురైన ఎస్‌ఐ కృష్ణ త్వరగా కోలుకోవాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా, వ్యక్తిగతంగా నష్టపోయినా మొక్కవోని ధైర్య ం , విశ్వాసంతో మీరు ప్రజలకు అందిస్తున్న సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’అని డీజీపీ ట్వీట్‌ చేశారు. కాగా, చికిత్స పొందుతున్న  కృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలు విరగడంతో పాటు,కంటి నొసలు వద్ద గాయమైందని కిమ్స్‌కు చెందిన డాక్టర్‌ ఐవీ రెడ్డి విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం సర్జరీ కి ఏర్పాట్లు చేశామని, 3 నెలల పాటు విశ్రాంతి అవసరమని అందులో పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top