వినోద్‌ ఖలాల్‌పై పీడీ యాక్ట్‌

PD Act File on Vinod Kalal Kurnool - Sakshi

12 నకిలీ మద్యం కేసుల్లో నిందితుడు 

కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

కర్నూలు: నకిలీ మద్యం తయారీ ముఠా నాయకుడు వినోద్‌ ఖలాల్‌పై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇతనిది కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్‌ జిల్లా హుబ్లీలోని గణేష్‌ పేట. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్, నకిలీ లేబుళ్లు, నకిలీ మూతలు, కారామిల్‌ తదితర వాటిని  రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ రవాణా చేస్తుండేవాడు. తద్వారా అటు ఎక్సైజ్, ఇటు సివిల్‌ పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. ఇతనిపై కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో  కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్, రాష్ట్రంలోని ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించేవాడు. వారికి నకిలీ మద్యం తయారీకి అవసరమైన వస్తువులను సరఫరా చేసేవాడు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 20న  డోన్‌ పట్టణ శివారులోని కంబాలపాడు వద్ద పేరంటాలమ్మగుడి వెనక  సీసీఎస్‌ డీఎస్పీ వినోద్‌కుమార్‌తో పాటు డోన్‌ అర్బన్‌ సీఐ కంబగిరి రాముడు, సిబ్బంది కలిసి  వినోద్‌ ఖలాల్‌ను పట్టుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు  తరలించారు. ఈ కేసుల్లో మిగిలినముద్దాయిలను కూడా డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్‌ చేసి..రిమాండ్‌కు పంపారు. వినోద్‌ ఖలాల్‌పై ఎక్సైజ్‌ , సివిల్‌ పోలీస్‌ స్టేషన్లలో 2017 నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసుల్లో ముద్దాయిగా ఉండటంతో ఇతనిపై పీడీ చట్టం అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎస్పీ ఫక్కీరప్ప జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌కు నివేదిక సమర్పించారు.  అందుకు అనుమతి ఇస్తూ ఈ నెల 15న కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. జిల్లా ప్రధాన జైల్లో ఉన్న వినోద్‌ ఖలాల్‌పై శుక్రవారం పీడీ చట్టం కేసు నమోదు చేసి.. సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top