ఉసురుతీసిన డ్రెయిన్‌

Old Woman Died In Drain - Sakshi

డ్రెయిన్‌లో పడి వృద్ధురాలి మృతి

కల్వర్టు దాటేక్రమంలోకేఎల్‌రావునగర్‌లో ఘటన

ఆమె వయసు 60 ఏళ్లు.. ఇంట్లో కాలక్షేపం చేయాల్సిన వయసు.. భర్తతో వేరుగా ఉండడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. ఇంకా బతుకుపోరు సాగిస్తూనే ఉంది.. పొట్టకూటి కోసం ప్రతిరోజు ఇళ్లలో పనికి వెళ్తోంది.. రోజులాగే గురువారం పనికి వెళ్తుండగా డ్రెయిన్‌ కబళించింది... ఈ ఘటన కేఎల్‌రావునగర్‌లో చోటుచేసుకుంది.

చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): కేఎల్‌రావునగర్‌ పిళ్లా సింహచలం వీధిలో గురజాపు దుర్గ(60) తన కుమార్తె సరస్వతితో కలసి ఉంటోంది. దుర్గ భర్త చిన్నారావు కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. దుర్గ, చిన్నారావులకు మొత్తం 5 గురు సంతానం, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమారుడు ఏడేళ్ల కిందట మృతి చెందాడు. కుమార్తె సరస్వతి భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటోంది. దుర్గ స్థానికంగా ఉండే ఇళ్లలో పనిచేస్తూ వచ్చే డబ్బులతో ఇంటి అద్దె, కుటుంబ పోషణ చూస్తోంది.

ప్రమాదం ఎలా అంటే..
కేఎల్‌రావునగర్‌ మొదటి లైను వైపు నుంచి పని చేసే ఇంటికి దుర్గ వెళ్తూ డ్రెయిన్‌ దాటేందుకు ప్రయత్నించింది. డ్రెయిన్‌పై మూత లేకపోవడంతో జారి పడింది. డ్రెయిన్‌లో పడిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు.

అధికారుల నిర్లక్ష్యం..
అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. పనులు చేపట్టిన సంస్థ సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా..
మరో వైపు మృతురాలి కుటుంబానికి నష్ట పరిహారం ఇచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని స్థానిక కాంగ్రెస్,  వైఎస్సార్‌ సీపీ నేతలు పట్టుబట్టారు. తొలుత  మృతదేహాన్ని ఇంటికి తరలించాలని కోరిన పోలీసులు, తీరా కేసు నమోదు చేశాం.. పోస్టుమార్టంకు తరలించాలని కోరారు. దీంతో  నాయకురాలు నన్నం దుర్గాదేవి, స్థానిక కార్పొరేటర్‌ నాగోతి నాగమణి, వైఎస్సార్‌ సీపీ నాయకులు విశ్వనాథ రవి, కట్టా మల్లేశ్వరరావు, కూరాకుల నాగ, పిళ్లా సూరిబాబు, టీడీపీ నాయకులు గుర్రం కొండలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.  సీఐ మురళీకృష్ణ, వైఎస్సార్‌ సీపీ, టీడీపీ నాయకుల సమక్షంలో ఎల్‌అండ్‌టీ అధికారులతో చర్చించారు. చివరకు బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top