చనిపోయారా.. చంపేశారా?

Nine Migrant Workers Found Dead In Well In Warangal District - Sakshi

గొర్రెకుంట బావి సంఘటనపై అన్నీ అనుమానాలే

 బావిలో తేలిన వలస కూలీల శవాలు

రెండు రోజుల వ్యవధిలో 9 మృతదేహాల వెలికితీత

మృతుల్లో బెంగాలీ కుటుంబానికి చెందిన ఆరుగురు

ఇద్దరు మృతులు బిహార్‌ వలస కార్మికులు.. మరొకరు డ్రైవర్‌

విషప్రయోగం చేసి చంపారనే అనుమానం?

 మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా చుట్టూ సాగుతున్న దర్యాప్తు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌/ సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. గురువారం సాయంత్రం వరకు నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, శుక్రవారం మధ్యాహ్నం వరకు మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి. సాయిదత్త ట్రేడర్స్‌కు చెందిన గోనె సంచులు కుట్టే గోదాం పక్కన ఉన్న బావిలో మొత్తం 9 మంది శవాలు లభ్యమైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వీరందరి మరణానికి దారితీసిన కారణాలు ఏంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్‌ స్టోరేజీ సమీపంలోని బార్‌దాన్‌ కుట్టే గోదాంలో పనిచేసే మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం(45), కూతురు బుష్రా ఖాతూన్‌ (20)తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా మక్సూద్, అతడి భార్య, కూతురు, మనవడితో పాటు ఇద్దరు కుమారులు షాబాజ్‌ ఆలం, సోహిల్‌ ఆలంలు వరంగల్‌ కరీమాబాద్‌ ప్రాంతం నుంచి వచ్చి 2 నెలలుగా గోదాంలోని గదుల్లోనే ఉంటున్నారు. మక్సూద్, అతడి భార్య గోదాంలో గోనె సంచులు కుట్టే పనిచేస్తుండగా వారి కుమారుల్లో ఒకరు వరంగల్‌లోనే పాలిటెక్నిక్, మరొకరు ఇంటర్, కూతురు ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్నారు. వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి 20 ఏళ్ల కింద వరంగల్‌కు వలస వచ్చింది. శుక్రవారం మక్సూద్‌ కుమారులైన షాబాజ్‌ ఆలం(19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21) శ్రీరాం కుమార్‌షా(26) కనిపించకుండా పోవడం,సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ ఉండటంతో తొలుత వారిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. శుక్రవారం ఆ నలుగురి మృతదేహాలతోపాటు మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌(30) అనే డ్రైవర్‌ మృతదేహం బావిలో తేలడంతో కథ మరోమలుపు తిరిగింది. ఆ డ్రైవర్‌ పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్‌ సిరిపురకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.

బుష్రా చుట్టూ దర్యాప్తు
వీరందరినీ ఎవరైనా హత్య చేసి బావిలో పడేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత కాస్త స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, బావి వద్ద బట్టలు పిండిన మూటలు లభించాయి. బుధవారమే మక్సూద్‌ మనవడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలోనే బిహార్‌ యువకులు.. స్థానిక యువకుల మధ్య గొడవ జరిగిందని చెబుతున్నారు. వీరి ఇంటిపై ఉంటున్న శ్రీరాం, శ్యామ్‌ వీరి గొడవలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ గొడవతోనే వీరిపై విషప్రయోగం జరిగిందా.. అని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. యాకూబ్‌ పాషా అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. మక్సూద్‌ కూతురితో యాకూబ్‌ పాషాకు వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. పాఠశాల వయసు నుంచే వీరికి పరిచయం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ఘటన అతడి పనే అయి ఉంటే.. అంత మందిని ఒక్కడే చంపలేడని.. మరింకొందరి పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, మక్సూద్‌కు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని గోదాం యజమాని చెబుతున్నారు.

మక్సూద్‌, నిషా, బుష్రా ఖాతున్‌

శవాల గుట్టలా గొర్రెకుంట బావి..
ఒక్కొక్కటిగా తేలుతున్న శవాలతో.. గొర్రెకుంటలోని బావి శవాల గుట్టను తలపించింది. రెండో రోజు శుక్రవారం స్థానిక గొర్రెకుంటవాసులు ఉదయం 7 గంటలకు బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఓ శవం తేలి ఉండటాన్ని గమనించి పోలీసులకు తెలిపారు. దీంతో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ వి.రవీందర్, మామునూరు ఏసీపీ శ్యాంసుందర్, గీసుకొండ, పర్వతగిరి సీఐలు శివరామయ్య, పుల్యాల కిషన్, ఎస్‌ఐలు అబ్దుల్‌ రహీం, నాగరాజు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్‌ మృతదేహం తేలింది. ఆ తర్వాత బావిలోని నీటిని మోటార్‌తో తోడిస్తుండటంతో మక్సూద్‌ పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం, శ్రీరాం కుమార్‌షా, తర్వాత మక్సూద్‌ చిన్న కుమారుడు సోహిల్‌ ఆలం, చివరగా శ్యాం కుమార్‌షా మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 

రంగంలోకి క్లూస్‌ టీం..
పోలీసులు, వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌కు చెందిన డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, ఫైర్‌ సర్వీసెస్, మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులతో మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో ఎక్కించారు. కాగా, బావిలో శవాలై తేలిన ఇద్దరు బిహార్‌ వలస కార్మికులు ఉండే డాబా పైగదులతో పాటు మక్సూద్‌ కుటుంబం నివాసం ఉండే మెయిన్‌ గేటు లోపలి వైపు ఉన్న గదుల్లో నిపుణులు వేలి ముద్రలను సేకరించారు. అలాగే వండిన భోజనం, తినకుండా ప్లేట్లలో వదిలేసిన ఆహారపదార్థాలను పరీక్షల నిమిత్తం సేకరించారు.

శ్యామ్, శ్రీరామ్‌ నివాసం ఉండే గదిలో మిగిలిపోయిన భోజన పదార్థాలు 

నీళ్లలో మునిగాకే మృతి
తొమ్మిది మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు మొదలైన పోస్టుమార్టం రాత్రి 9.30 గంటలకు పూర్తయింది. పోస్టు మార్టంపై వైద్యులు ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. మృతులందరూ నీళ్లలో మునిగాకే చనిపోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక మృతుల్లో మూడేళ్ల బాలుడు మినహా మిగిలిన 8 మంది శరీరాలపై బావిలో పడినప్పుడు రాళ్లు, ఇతరత్రా గీరుకుపోయిన గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక విషాహారం తీసుకున్నారా లేదా అనేది తేల్చేందుకు మృతదేహాల నుంచి సేకరించిన ‘మిశ్రా’ను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు.

విషప్రయోగం జరిగిందా..?
ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి వీరిపై విష ప్రయోగం జరిగిందని పోలీసులు అభిప్రాయానికి వచ్చారని సమాచారం. సాధారణంగా బావిలో తేలిన మృతదేహాల పరిస్థితిని బట్టి అది ప్రమాదమా..? మరణించాక పడేశారా? అన్న విషయంలో ఘటనా స్థలంలోనే ప్రాథమిక అంచనాకు వస్తారు. అయితే ఇక్కడ బావిలో తేలిన మృతదేహాల పరిస్థితి చూసిన పలువురు పోలీసులు వీరిపై విష ప్రయోగం జరిగిందని చెబుతున్నారు. ఎందుకంటే బుధవారం రాత్రి 9 గంటల వరకు మక్సూద్‌ కుటుంబసభ్యులు మెలకువతోనే ఉన్నారన్న పక్కా సమాచారం పోలీసుల వద్ద ఉంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

మృతదేహాలను తరలిస్తున్న సిబ్బంది 

ఆ 12 గంటలే కీలకం..
బుధవారం మక్సూద్‌ కుటుంబసభ్యులతో పాటు, పక్క గదిలో ఉండే ఇద్దరు బిహార్‌ యువకుల శరీరంలోకి ఆహారం లేదా ఫ్రూట్‌ జ్యూస్‌ ద్వారా విషం చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ విషప్రయోగం జరిగి ఉంటే వారు వెంటనే చనిపోయి ఉండరు. పైగా వారి మృతదేహాలను బావి వద్దకు తీసుకెళ్లి పడేసేందుకు అర్ధరాత్రి వరకు ఆగి ఉంటారు. అంటే బుధవారం రాత్రి అర్ధరాత్రి 12 గంటలు దాటాకే పడేసే అవకాశముంది. సాధారణంగా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాత శరీరంలో కాఠిన్యత మొదలవుతుంది. ఫలితంగా గ్యాస్‌లు ఏర్పడతాయి. దీంతో శరీరం 20 నుంచి 24 గంటల్లో పైకి తేలుతుంది. ఇది శరీరంలో ఉన్న కొవ్వుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఆడవారు, చిన్నపిల్లల దేహంలో గ్యాస్‌లు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి వీరి శవాలు ముందే నీటిపై తేలుతాయి. అయితే బయటే ప్రాణాలు పోయిన దేహాలు మాత్రం పైకి తేలేందుకు 12 గంటల సమయం మాత్రమే పడుతుంది.

ఐదుగురు బతికే ఉన్నారా?
మొదటిరోజు బయటికి వచ్చిన మక్సూద్, అతడి భార్య, కూతురు, మనవడు మృతదేహాలు ఈ కారణాల వల్లే ముందుగా పైకి తేలాయని భావిస్తున్నారు. అలాగే శుక్రవారం పైకి తేలిన ఐదు మృతదేహాల్లో అందరికీ ముక్కు వద్ద నురగ ఉంది. అంటే వీరిని బావిలో పడేసే సరికి కొన ఊపిరితో ఉండి ఉంటారని భావిస్తున్నారు. బావిలో పడ్డాకే చనిపోయి ఉంటే ఊపిరితిత్తుల్లోకి, మధ్య చెవి వరకు నీరు చేరుతుంది. శరీరంలో డయాటమ్స్‌ (శైవలాలు) చేరతాయి. అదే మరణించిన తర్వాత పడేస్తే.. ఇవేమీ కనబడవు. విస్రా (శరీరంపై విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిపే టెస్టు)లో విషప్రయోగంపైనా స్పష్టత వస్తుంది.

మృతుల్లోనే హంతకుడూ ఉన్నాడా?
ఈ కేసులో పోలీసులు మరో ఆసక్తికర కోణంలోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులు ఎక్కడి నుంచో రారు. పరిచయస్తులే దారుణాలకు ఒడిగడతారు. ఇలాంటి నరమేధాల అనంతరం భయంతో వారు కూడా ఆత్మహత్యకు పాల్పడుతారు. ఒకవేళ అదే నిజమైతే.. చివరగా పైకి తేలిన మృతదేహం హంతకుడిదే అయి ఉండొచ్చని కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top