అది హత్యే..

Murder Case Reveals East Godavari Police - Sakshi

తేల్చిన పోలీసులు, ముగ్గురు నిందితుల అరెస్ట్‌

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: దీపావళికి జరిగిన చిన్న ఘర్షణతో ఓ యువకుడిని హత్య చేసి గోదావరిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులు పోలీసులకు చిక్కారు. తూర్పు మండలం డీఎస్పీ యు.నాగరాజు బుధవారం రాజమహేంద్రవరం పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో త్రీటౌన్‌ సీఐ శేఖర్‌ బాబుతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. విశాఖ జిల్లా, గుమ్మలపాడు గ్రామానికి చెందిన పట్టిమ కిరణ్‌ బాబు (23) రాజమహేంద్రవరంలోని ఓ స్కూల్లో బస్సు డ్రైవర్‌గా పని చేస్తూ రాజమహేంద్రవరం లలితా నగర్‌లో ఉండేవాడు. దీపావళి సందర్భంగా కాల్చిన టపాసుల కారణంగా కిరణ్‌ బాబు కుటుంబ సభ్యులకు, లలితానగర్‌కు చెందిన ఆళ్ల సాయి(పొట్టి సాయి)కి మధ్య  ఘర్షణ చోటు చేసుకుంది.

కక్షపెంచుకున్న ఆళ్ల సాయి, తన స్నేహితులు లలితానగర్‌కు చెందిన భోగా కార్తీక్, పిన్నింటి ఉదయ భాస్కర్, ఆదెమ్మ దిబ్బ ప్రాంతానికి చెందిన  వారాది సాయి, మీసాల మహేష్, రామారావు(బాబి) అనే వారికి డిసెంబర్‌ 13వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాగా మద్యం పోయించాడు. కిరణ్‌ బాబును భయపెట్టాలని చెప్పి వాళ్లను లలితా నగర్‌లోని 2వ వీధి వేపచెట్టు వద్దకు తీసుకువచ్చారు. కిరణ్‌ బాబును వీరందరూ దారుణంగా కొట్టారు. గాయాల పాలైన కిరణ్‌ బాబు ‘మీ అంతు చూస్తాను’ అని చెప్పి వెళ్లిపోతుండగా గామన్‌ ఇండియా బ్రిడ్జి(నాల్గవ వంతెన) వద్ద పట్టుకొని మరలా కొట్టి పీక నొక్కి హత్య చేశారు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆరుగురు నిందితులు గామన్‌ ఇండియా బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలోకి మృతదేహాన్ని  పడవేశారు.

తేల్చిన పోలీసులు, ముగ్గురు నిందితుsiల అరెస్ట్‌
కిరణ్‌ బాబు మృతితో కుటుంబం వీధిన పడింది. మృతుడు కిరణ్‌ బాబు నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్య గర్భిణి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  నిందితుల వెనుక రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

దొరికిందిలా..
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితులు మృతదేహాన్ని చీకట్లో గోదావరిలో పడవేశామనుకొని,  ఒడ్డునే పడవేశారు. డిసెంబర్‌ 14న గామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో త్రీటౌన్‌ సీఐ శేఖర్‌ బాబు, ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు పట్టిమ కిరణ్‌బాబుగా గుర్తించారు. పోస్టు మార్టం నివేదికలో మృతుడి శరీరంపై గాయాలు ఉండడం, కొన్ని ఎముకలు విరిగి ఉండడంతో పాటు గోదావరిలో పడి మృతి చెందితే ఊపిరితిత్తులు, శరీరం నిండా నీరు చేరుతోంది. మృతదేహంలో ఏవిధమైన నీరు లేకపోవడం, శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు భోగ కార్తిక్, పిన్నింటి ఉదయ భాస్కర్, వారాధి సాయిలను అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురు మీసాల మహేష్, ఆళ్ల సాయి, రామారావులను అరెస్ట్‌ చేయాల్సి ఉందని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top