నమ్మించి మోసం చేశారు: నిర్మాత

Movie Producer Cheated By 3 Persons Over Rare Metal Case Filed - Sakshi

ముంబై : తనను నమ్మించి మోసం చేశారంటూ బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత విపుల్‌ షా పోలీసులను ఆశ్రయించాడు. తనకు రూ. 5 కోట్ల మేర నష్టం కలిగించారని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులపై నాగ్‌పూర్‌ ఆర్థిక నేర విభాగానికి ఫిర్యాదు చేశాడు. వివరాలు... సింగ్‌ ఈజ్‌ కింగ్‌, కమాండో, ఫోర్స్‌, యాక్షన్‌ రీప్లే వంటి పలు హిట్‌ సినిమాలు నిర్మించిన విపుల్‌ షాకు 2010లో రాజ్‌ సింగ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. విపుల్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌లో దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తానని నమ్మించాడు. ఈ క్రమంలో విపుల్‌తో పాటు అతడి వ్యాపార భాగస్వామి వినీత్‌ సింగ్‌తో పరిచయం పెంచుకుని.... తాము యాంటిక్‌(పురాతన కళాఖండాలు)లు సేకరిస్తున్నామని చెప్పాడు. వాటిలో ఉండే అరుదైన ఇరీడియం(అరుదైన లోహం)కు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయని నమ్మబలికాడు. రక్షణా రంగంలో కూడా దీనిని వినియోగిస్తున్నారని... తద్వారా విజయం సాధిస్తున్నారంటూ మాయమాటలు చెప్పాడు.

అదే విధంగా ఈ వ్యాపారంలో తమకు అండగా నిలిస్తే భవిష్యత్‌లో విపుల్‌ నిర్మాణ సంస్థలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఆకర్షించాడు. రాజ్‌ మాటలు నమ్మిన విపుల్‌ ఇరీడియం సేకరణలో భాగంగా ఏకంగా రూ. 5 కోట్ల మేర ఖర్చు చేశాడు. అయితే ఎన్నిరోజులు గడిచినా రాజేశ్‌ నుంచి ఆశించిన ఫలితం రాకపోవడంతో విపుల్‌ తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శుక్రవారం నాగ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో రాజ్‌ సింగ్‌ను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా అక్షయ్‌ కుమార్‌, జాన్‌ అబ్రహం, అర్జున్‌ కపూర్‌ తదితర బాలీవుడ్‌ స్టార్లతో సినిమాలు నిర్మించిన విపుల్‌ కొన్ని చిత్రాలకు దర్శకుడిగానూ పనిచేసిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top