
రాంబిల్లిలో విలేకరులలో మాట్లాడుతున్న సీఐ విజయ్‌నా«థ్, ఎస్‌ఐ చక్రధరరావు
విశాఖపట్నం, రాంబిల్లి(యలమంచిలి): దిమిలిలో సంచలనం రేపిన చిన్నారి రమ్య హత్య కేసులో ఆమె తల్లి బండి ఉమను బుధవారం అరెస్ట్ చేసినట్టు సీఐ కె.కె.వి. విజయనా«థ్ తెలిపారు. ఈ నెల 21న బండి రమ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎస్‌ఐ వి.చక్రధరరావుతో కలిసి సీఐ రాంబిల్లిలో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తన ఏడేళ్ల కుమార్తె పీకనులిమి చంపినట్టు ఉమ అంగీకరించిందన్నారు. ఉమను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండు విధించారని చెప్పారు. అనంతరం ఆమెను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు. ఉమ, భర్త అప్పారావుల మధ్య సఖ్యత లేదని సీఐ తెలిపారు. ఆ కోపం పిల్లలపై చూపేదని, రెండుమూడు సార్లు భర్తను సైతం కొట్టి గాయపరిచినట్టు తమ విచారణలో తేలిందన్నారు.
స్కూల్‌కు వెళ్లనని చెప్పడంతో పీకనులిమి వేసినట్టు ఉమ అంగీకరించిందని, ఈ సమయంలో తన నాలుగేళ్ల కుమారుడు మనోజ్ అక్కను అమ్మ చంపేస్తోందని అరచినట్టు కూడా ఉమ అంగీకరించిందన్నారు. తర్వాత ఏమీ తెలియనట్టు రమ్యపై దుప్పటి కప్పినట్టు తెలిపారు. కొంత సేపటికి ఇంటికి వచ్చిన పెద్ద కుమార్తె వాణిని... నిద్రిస్తున్న చెల్లిని లేపని, బడికి సమయం అవుతోందని ఉమ తెలిపింది. అయితే అప్పటికే రమ్య మృతి చెంది ఉంది. దీంతో ఏమీ తెలియనట్టు ఉమ నటించి, తన కూతురు చనిపోయిందని ఇరుగు పొరుగుకు చెప్పిందని సీఐ తెలిపారు. ఈ లోగా తమకు అందిన సమాచారం మేరకు దిమిలి వెళ్లి విచారణ చేపట్టి ఉమను అరెస్ట్ చేసినట్టు సీఐ విజయనాథ్ తెలిపారు.