బస్సులో నుంచి పడిపోయిన తల్లి, ఇద్దరు చిన్నారులు  | Mother And Two Little Girls Who Fell From The Bus | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన ప్రమాదం

Jun 26 2018 11:19 AM | Updated on Jun 26 2018 11:19 AM

Mother And Two Little Girls Who Fell From The Bus - Sakshi

 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నస్రీన్‌ 

ఖమ్మంరూరల్‌ : ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళ్లే లగ్జరీ బస్సు  నుంచి ఓ మహిళా ప్రయాణికురా లు, అయిదేళ్ల లోపు ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడి గాయపడిన సంఘటన సోమవారం తల్లంపాడు వద్ద జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు బస్సు బయలుదేరిన పది నిమిషాల్లోపే తల్లంపాడు ఉన్నత పాఠశాల వద్ద ఈ సంఘటన జరిగింది.

బస్సు డ్రైవర్‌ ముందు వెళ్లే వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీని తప్పించేందుకు ఒక్కసారిగి పక్కకు తీసుకొని సడెన్‌బ్రేక్‌ వేశాడు. దీంతో కుడివైపు ముందు వరుస సీట్లో కూర్చున్న ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్‌కు చెందిన ఎస్‌కే నస్రీన్, ఐదేళ్ల లోపు ఆమె ఇద్దరు కుమారులు కుదుపునకు లోనయ్యారు.

వారు సీటులో నుంచి ఫుట్‌ బోర్డుపై పడి ఒక్కసారిగా నడి రోడ్డుపై జారి పడ్డారు. దీంతో నస్రీన్‌ తలకు, చేతికి గాయాలయ్యాయి. పిల్లలు ఇద్దరు ఒడిలో నిద్రిస్తుండగా  ఆమె పిల్లలను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవడంతో పిల్లలకు స్వల్ప గాయాలతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో వీరికి పెనుప్రమాదం తప్పింది.

బస్సును డ్రైవర్‌ రోడ్డు పక్కకు ఆపగా, వెంటనే తోటి ప్రయాణికులు రోడ్డుపై పడ్డ తల్లి, పిల్లలను పైకి లేపారు. గాయాలతో రక్తమోడుతున్న తల్లికి ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఏడుస్తున్న చిన్నారులను రోడ్డుపై ఆగిన ఓ వాహనదారుడు తన కారులో ఎక్కించుకుని స్థానికంగా  ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. అప్పటికే ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదే బస్సులో వెనుక కూర్చున్న నస్రీన్‌ అత్త సురక్షితంగా బయటపడింది. మిగతా ప్రయాణికులు బస్సు కుదుపునకు గురయినప్పటికీ ఎవరికి ఏమీ కాలేదు. బస్సు వేగంగా వెళుతున్నప్పుడు సడెన్‌ బ్రేక్‌ వేయడం, బస్సు డోర్‌ వేసి లేకపోవడంతోనే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాస్తవంగా ఖమ్మం నుంచి బయలుదేరాక ఈ బస్సు సూర్యాపేటలోనే ఆగుతుంది. మధ్యలో ఎక్కడా స్టాఫ్‌ లేదు. అయినా డ్రైవర్‌ డోర్‌ వేసుకోకపోవడం గమనార్హం. రోడ్డుమీద పడిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement